చిన్న సినిమాల మీద జనాల్లో ఆసక్తి పెంచేందుకు, వాళ్లను థియేటర్లకు రప్పించేందుకు మేకర్స్ తమ చిత్రాల గురించి కొంచెం ఎక్కువ చేసే చెప్పుకుంటూ ఉంటారు. ఈ శుక్రవారం రిలీజైన రావు బహదూర్ గురించి కూడా టీం చాలా గొప్పగానే చెప్పుకుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తరహాలో వేరే ఇండస్ట్రీలు చెప్పుకునే తెలుగు సినిమా ఇదన్నారు. అంతే కాక సత్యదేవ్‌ను కమల్ హాసన్‌కు రీప్లేస్మెంట్ అని కూడా స్టేట్మెంట్ ఇచ్చేశారు.
ఐతే రావు బహదూర్ మంచి సినిమానే అయినా, సత్యదేవ్ బాగా పెర్ఫామ్ చేసినా.. సినిమా చూసినపుడు ఆ స్టేట్మెంట్లు అయితే అతిగానే అనిపించాయి. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ గురించి రచయిత, నిర్మాత సాయి రాజేష్ వ్యాఖ్యలు కూడా ఇలాగే కొంచెం బోర్డర్ దాటేసినట్లు కనిపిస్తున్నాయి. తాను తీసిన బేబీ సినిమాకు చెన్నై లవ్ స్టోరీ మూడు రెట్లు ఉంటుందని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం.
చెన్నై లవ్ స్టోరీ సినిమాను తాను ఇప్పటికే పదిసార్లు చూశానని.. తాను తీసిన బేబీ సినిమాలో ఉన్న ఎమోషన్‌తో పోలిస్తే రెండు రెట్లు కాదు, మూడు రెట్లు గొప్ప సినిమా ఇది అవుతుందనడంలో సందేహం లేదని సాయిరాజేష్ అన్నాడు. ఈ సినిమాను ప్రేక్షకులు సూపర్ హిట్ చేస్తారా, బ్లాక్ బస్టర్ చేస్తారా అన్నది వాళ్ల చేతుల్లో ఉందని.. కానీ మంచి సినిమా తీయడం మాత్రం తమ చేతుల్లో ఉందని.. తాము మాత్రం చాలా గొప్ప సినిమా చేశామని చాలా నమ్మకంగా చెప్పగలమని సాయిరాజేష్ అన్నాడు.
మరో నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. ఒక మెగా అభిమానిగా తనకు జులై 24 చాలా స్పెషల్ అని.. ఆ రోజే ఇంద్ర, తొలి ప్రేమ సినిమాలు రిలీజై బ్లాక్‌బస్టర్లు అయ్యాయని.. అదే కోవలో చెన్నై లవ్ స్టోరీ కూడా పెద్ద సక్సెస్ అవుతుందని.. ముందు రోజు రాత్రే ఈ చిత్రానికి పెయిడ్ ప్రిమియర్స్ పెద్ద ఎత్తున వేస్తామని చెప్పాడు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీకి రవి నంబూరి దర్శకత్వం వహించాడు. మరి సాయి రాజేష్ చెబుతున్నంత గొప్పగా చెన్నై లవ్ స్టోరీ ఉంటుందా.. బేబీని మించిన సినిమా అవుతుందా అన్నది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
