రోజుకు 8 గంటలకు మించి పని చేయనంటూ ఈ మధ్య దీపిక పదుకొనే ఫిలిం మేకర్స్‌కు కండిషన్ పెట్టడం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. దీని వల్ల ఆమె కల్కి-2, స్పిరిట్ లాంటి క్రేజీ ప్రాజెక్టులకు దూరం కావాల్సిన పరిస్థితి కూడా తలెత్తిందని వార్తలు వచ్చాయి. ఐతే ఈ కండిషన్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
సినిమా షూటింగ్ అన్నది ఎందరో డేట్లతో ముడిపడి ఉంటుంది, ఇంకా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి.. టైమింగ్స్ విషయంలో మరీ అంత పర్టికులర్‌గా ఉంటే ఎలా అనే ప్రశ్నలు వేశారు కొందరు. మరి కొందరేమో దీపిక పద్ధతి కరెక్టే అని వాదించారు. సినిమా నటులకు వ్యక్తిగత జీవితాలు ఉండవా.. ప్రతిరోజూ కాంప్రమైజ్ అవుతూ పోతే కష్టం కదా అన్న వాదన వినిపించింది. హీరోయిన్లలో కొందరు దీపికకు మద్దతుగా గళం విప్పారు.
ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా అదే తరహాలో మాట్లాడుతోంది.
తాను కూడా వర్కింగ్ అవర్స్ విషయంలో ఇప్పుడు చాలా పర్టికులర్‌గా ఉంటున్నట్లు ఆమె చెప్పింది. ఒకప్పుడు తాను రౌండ్ ద క్లాక్ పని చేశానని.. టైమింగ్స్ చూసుకునేదాన్ని కాదని.. కానీ ఇప్పుడు మాత్రం అలా పని చేయలేనని చందమామ స్పష్టం చేసింది.
ఇప్పుడు తనకు పెళ్లయి ఒక కుటుంబం ఉందని, కొడుకు ఉన్నాడని.. వాళ్ల కోసం సమయం కేటాయించాల్సిందే అని.. కాబట్టి రోజూ ఇన్ని గంటలే పని చేస్తానని, ఆదివారాలు షూటింగ్‌కు రానని ముందే అగ్రిమెంట్లో స్పష్టం చేస్తున్నానని కాజల్ వెల్లడించింది.
ఆర్టిస్టులు ఇలా కోరుకోవడం తప్పేమీ కాదని ఆమె అభిప్రాయపడింది. అన్ని రంగాల్లో పని వేళలు ఉన్నప్పుడు సినీ రంగంలో మాత్రం ఎందుకు ఉండకూడదని ఆమె పేర్కొంది. పెళ్లి తర్వాత కాజల్ కెరీర్ కొంచెం నెమ్మదించగా.. ఇటీవల ఆమె నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాతో మళ్లీ వార్తల్లోకెక్కింది. హిందీలో కాజల్ నటించిన ది ఇండియా స్టోరీ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
