ఫ్యామిలీ దర్శకుడు ఏమయ్యారు

రవితేజ, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలను హ్యాండిల్ చేసి బ్లాక్ బస్టర్ గీత గోవిందం ఇచ్చిన ఫ్యామిలీ దర్శకుడు నాన్ స్టాప్ గా సినిమాలు చేయాలి. అందులోనూ మహేష్ బాబు కోరి మరీ సర్కారు వారి పాట ఆఫర్ చేసినప్పుడు ఈపాటికి డిమాండ్ పీక్స్ లో ఉండాలి. కానీ పరశురామ్ పేట్ల పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. 2024 ది ఫ్యామిలీ స్టార్ రూపంలో డిజాస్టర్ ఇచ్చాక మళ్ళీ కనిపించనే లేదు. అదిగో ఇదిగో అంటూ పుకార్లు రావడం తప్ప సాలిడ్ కాంబినేషన్ పడలేదు.

దీనికి కారణాలు ఉన్నాయి. సర్కారు వారి పాట ఏదో మహేష్ బాబు ఇమేజ్, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వల్ల డబ్బులు తెచ్చింది కానీ స్వంత అభిమానులకే అంతగా నచ్చని మూవీ అది. సోషల్ మీడియాలో దాని ప్రస్తావన వచ్చినప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్లు గమనిస్తే పరశురామ్ మెప్పించలేకపోయాడనేది అర్థమవుతుంది. ఇక ది ఫ్యామిలీ స్టార్ సంగతి సరేసరి. రాంగ్ సబ్జెక్టు, మిస్ క్యాస్టింగ్ తో చేతులారా ఫ్లాప్ కొని తెచ్చుకుని నిర్మాత దిల్ రాజుకు నష్టాలు ఇచ్చారు.

దీని వల్ల పరశురామ్ పేట్లకు వెంటనే అవకాశాలు రాలేదన్నది స్పష్టం. హోంబాలే ఫిలిమ్స్ బ్యానర్ లో హృతిక్ రోషన్ హీరోగా పరశురామ్ ఒక మూవీ చేస్తారనే గాసిప్ ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ఇది కూడా నిజం కాదు. ఎలా సృష్టించారో కానీ ఎక్స్ లో తిరుగుతోంది. ఇప్పటికి రెండేళ్లు గడిచిపోయాయి. ఫ్యామిలీ స్టార్ కన్నా ముందు ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్య పరశురామ్ మీద నెగటివ్ కామెంట్స్ గతంలో వైరల్ అయ్యాయి. ఇది కొంత డ్యామేజ్ చేసిందని చెప్పాలి.

ఫ్లాపులు ఎవరికైనా వస్తాయి. రాజమౌళి, అనిల్ రావిపూడి లాంటి ఒకరిద్దరు తప్ప అందరూ చవి చూస్తారు. కానీ కంబ్యాక్ సరైన రీతిలో ప్లాన్ చేసుకోవాలి. ఆచార్య ఇచ్చిన కొరటాల శివ దేవర రూపంలో గొప్ప విజయం అందుకున్నారు. ఇప్పుడు బాలకృష్ణ ఆఫర్ దక్కించుకున్నారు. వంశీ పైడిపల్లి ఫ్లాపులు దాటుకుని సల్మాన్ ఖాన్ దాకా వెళ్ళిపోయారు. కానీ పరశురామ్ విషయంలో అలాంటి మూమెంట్ కనిపించకపోవడం విచిత్రం. ఈ మధ్య బయట కూడా కనిపించడం లేదు.