మనకు అంతగా పరిచయం లేదు కానీ తమిళ హీరో విష్ణు విశాల్ డబ్బింగ్ సినిమాలు అప్పుడప్పుడు థియేటర్లకు వస్తుంటాయి. ఆ మధ్య ఆర్యన్ అనే మూవీ ఒకటి రిలీజయ్యింది. టాలీవుడ్ జనాలు అస్సలు పట్టించుకోక ఫ్లాపయ్యింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కు మంచి బ్రేక్ ఇచ్చిన రాక్షసుడు ఒరిజినల్ వెర్షన్ లో నటించింది ఇతనే, నాలుగు సంవత్సరాల క్రితం 2022లో గట్టా కుస్తీ కంటెంట్ పరంగా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది.
నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక మనోళ్లు కూడా బాగానే చూశారు. తాజాగా తమిళంలో గట్టా కుస్తీ 2 విడుదలయ్యింది. ఊరికే టైటిల్ రెండు అని పెట్టేసి కొత్త కథ చెప్పకుండా పుష్ప, కెజిఎఫ్ తరహాలో ఒరిజినల్ స్టోరీనే కొనసాగించారు. కుస్తీ ఛాంపియన్ గా మారిపోయి రైల్వేలో ఉద్యోగం చేస్తున్న భార్య (ఐశ్వర్య లక్ష్మి) కోసం ఇంటి పనులు చేస్తూ బిడ్డను చూసుకుంటూ ఉండిపోయిన భర్త వీర కథే ఈ సీక్వెల్. ఇది ఓర్వలేని కొందరు వీళ్ళ కాపురంలో చిచ్చు పెడితే దాన్నుంచి బయటపడటమే అసలు స్టోరీ.
దర్శకుడు చెల్లా అయ్యవు ఈసారి కామెడీ డోస్ మరింత పెంచేశాడు. లైన్ వింటే కొంచెం సీరియస్ గా అనిపించినప్పటికీ పూర్తిగా ఫన్ మీద ఆధారపడ్డారు. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మికి తోడుగా చైల్డ్ ఆర్టిస్టుని పెట్టడంతో హాస్యం మరింత పెరిగింది. కాకపోతే ఎమోషన్లు, డ్రామా పెద్దగా పండలేదు కానీ టైం పాస్ కి లోటు లేకుండా కథనం నడిపించారు. బుక్ మై షోలో గంటకు 8 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతూ ఉండటమే దీని సక్సెస్ కు నిదర్శనం.
గట్టా కుస్తీ 2ని తెలుగులో అనువదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాకపోతే విష్ణు విశాల్ ఇమేజ్ దృష్ట్యా కనెక్ట్ అవుతుందా లేదానే అనుమానాలు లేకపోలేదు. నిజానికి దీన్ని ఫస్ట్ పార్ట్ టైంలోనే కొందరు నిర్మాతలు రీమేక్ చేయాలని ట్రై చేశారు. కానీ హీరోయిన్ డామినేషన్ మూవీ కావడంతో హీరోలు అంత సుముఖత చూపించలేదు. ఇంకో విశేషం ఏంటంటే బాలీవుడ్ భారీ మూవీ అల్ఫా కంటే ఈ గట్టా కుస్తీ 2నే బుక్ మై షోలో వేగంగా దూసుకుపోతోంది. కంటెంట్ బలమది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
