అగ్ర నిర్మాతకు పాకిస్తాన్ పైత్యం

అగ్ర నిర్మాత గా ఆదిత్య చోప్రాకున్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షారుఖ్ ఖాన్ కు ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడిగా ఆయన సాధించిన ఖ్యాతి అపారం. లెజండరీ ఫిలిం మేకర్ యష్ చోప్రాకు నిజమైన వారసుడిగా ఒక దశలో గొప్ప పేరు తెచ్చుకున్నారు. కానీ స్పై యూనివర్స్ మత్తులో పడి ఒకేలాంటి కథలను పదే పదే ఇతర దర్శకులతో తీయిస్తూ తన సంస్థకున్న బ్రాండ్ వేల్యూని తగ్గించుకుంటున్నారు. దీనికి తాజాగా ఉదాహరణ అల్ఫా.

అదేం విచిత్రమో కానీ ఒక్క విషయంలో ఆదిత్య చోప్రా ఆలోచనా ధోరణి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. పాకిస్థాన్ మీద కోపం కంటే అదో రకమైన అభిమానం ఉన్న తరహాలో, బలవంతంగా విలన్ పాత్రను ఆ దేశానికి ముడిపెడుతున్న తీరు క్రమంగా ఎబ్బెట్టు అనిపిస్తోంది. అల్ఫాలో బాబీ డియోల్ మొదట ఇండియన్ సోల్జర్ గానే పరిచయమవుతాడు. క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటంటే ఇతగాడు పాకిస్థాన్ నుంచి వచ్చి రహస్యంగా మన దేశపు ఆర్మీలో చేరిన సీక్రెట్ ఏజెంట్.

అంటే దురంధర్ కి రివర్స్ అన్నమాట. అందులో ఆదిత్య ధార్ చాలా లాజికల్ గా హంజా పాత్రని డిజైన్ చేశారు. కానీ అల్ఫాలో దర్శకుడు శివ రవైల్ ఇష్టమొచ్చినట్టు క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకున్నారు. ఇలా జరగడం మొదటిసారి కాదు. టైగర్ జిందా హైలో ఇదే ఆదిత్యా చోప్రా ఇండియా, పాక్ మిలిటరీ దళాలు కలిసి పాటలు పాడుకున్నట్టు చూపిస్తారు. టైగర్ 3లో శత్రు దేశం పాలకులు చాలా మంచి వాళ్ళు అనే తరహా సిమ్రాన్ క్యారెక్టర్ ని తీర్చిదిద్దారు.

ఇలా చెప్పుకుంటూ పోతే పఠాన్, వార్, వార్ 2 ఇలా ప్రతి సినిమాలో పాకిస్థాన్ ఎలిమెంట్ లేకుండా ఆదిత్య చోప్రా సినిమాలు తీయడం లేదు. పోనీ దురంధర్ లాగా అటాకింగ్ స్టయిల్ లో ఉంటుందా అంటే అదీ లేదు. పైపై పూతలతో ఓవర్ హీరోయిజం చూపించడం తప్ప పాక్ మీద దాడి చేసినట్టు ఉంటుందా అంటే అదీ లేదు. అల్ఫా మీద విమర్శకులు విరుచుకుపడుతున్నారు. స్పై యునివర్స్ ని సమాధి చేశారని, ఇంత దారుణమైన గూఢచారి సినిమాని తాము ఎప్పుడూ చూడలేదంటూ విమర్శకులు తలంటుతున్నారు.