ఇటీవలే సింగర్ సునీత మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్త్రీలు ‘నా శరీరం నా ఇష్టం’ అన్నప్పుడు అవతలి వాళ్ళు కూడా ‘మా కళ్ళు మా ఇష్టం’ అంటారని చెబుతూ స్వాతంత్రం, సాధికారికత గురించి తనదైన శైలిలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇది సోషల్ మీడియాలో కొన్ని వర్గాలకు ఇంకో అర్థంలో వెళ్ళిపోయింది. ఆవిడ ఉద్దేశాన్ని సరిగా అర్థం చేసుకోలేని కొందరు ట్రోలింగ్ చేసేందుకు కూడా వెనుకాడలేదు. విమెన్ ఎంపవర్ మెంట్ మీద తరచు పోరాడే చిన్మయి దీనికి సంబంధించి ఒక ట్వీట్ వేశారు.
దీనికి సునీత తిరిగి స్పందిస్తూ మా కళ్ళు మా ఇష్టం అనే పరిధి దాటి ఆలోచించలేని సొసైటీలో ఉన్నామని, అందుకే ఆ ఉద్దేశంతో అన్నానని, ఎవరైనా నా చేతులు నా ఇష్టం అని తెగబడి ముందుకు వస్తే వాటిని విరగొట్టే వాళ్లలో ముందు నేనే ఉంటానని సునీత తేల్చి చెప్పేశారు. మరో డిబేట్ కు తావు ఇవ్వకుండా స్పష్టంగా కుండ బద్దలు కొట్టేశారు. మహిళలకు నష్టం కలిగించేలా సునీత కామెంట్స్ ఉన్నాయని చిన్మయి చెప్పిన నేపథ్యంలో ఈ కౌంటర్ రావడం విశేషం.
ఈ టాపిక్ గురించి ఎక్స్, ఇన్స్ టా తదితర మాధ్యమాల్లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. స్త్రీ ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఎలాంటి ఆలోచనా విధానం కలిగి ఉండాలనే దాని మీద ప్రవాహంలా సాగుతూనే ఉన్నాయి. చిన్మయినే కాదు పలు సందర్భాల్లో యాంకర్ అనసూయ సైతం వీటి మీద చిన్నపాటి యుద్ధాలే చేస్తూ వచ్చారు. కొన్నిసార్లు పోలీస్ కంప్లయింట్ దాకా వెళ్లాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సునీత మాటలు వ్యవహారాన్ని కొత్త మలుపు తిప్పాయి.
ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనే దాని కన్నా సమాజం సున్నితంగా మారిపోయి ఆడపిల్లలకు రక్షణ కరువైన చోట ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవడం తప్ప ఎవరేం చేయలేని సొసైటీలో ఉన్నాం. ఏదైనా జరిగితే ఓ రెండు రోజులు సానుభూతి, ప్రభుత్వాల నుంచి కంటితుడుపు చర్యలు తప్ప తప్పులు చేసిన వారి వెన్ను వణికేలా చర్యలు తీసుకున్న దాఖలాలు తక్కువ. మరి సునీత ఇంత స్పష్టంగా సమాధానం చెప్పాక రెగ్యులర్ గా ఎక్స్ లో ఉండే చిన్మయి తిరిగి ఏం బదులు చెబుతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates