మన హీరోలేమో ఏడాదికి ఒక రిలీజ్ ఉండటమే మహా కష్టమైపోయి ప్యాన్ ఇండియా మోజులో ఏళ్లకేళ్లు ఖర్చు పెట్టేస్తున్నారు. మనం ఏ హిందీ మార్కెట్ అయితే టార్గెట్ చేసుకుంటున్నామో అదే బాలీవుడ్ స్టార్లు చకచకా చిత్రాలు చేస్తూ సంవత్సరానికి కనీసం మూడు నాలుగు ఉండేలా చూసుకుంటున్నారు. అందరికీ అక్షయ్ కుమార్ కనిపిస్తాడు కానీ అజయ్ దేవగన్ నేనేం తీసిపోలేదంటూ మంచి సక్సెస్ రేట్ తో దూసుకెళ్తున్న వైనం గమనించవచ్చు. ముఖ్యంగా సీక్వెల్స్ విషయంలో.
ఈయన లిస్టు చూస్తే వచ్చే నెల ‘ఢమాల్’ 4 రానుంది. అంచనాలు బాగానే ఉన్నాయి. మొదటి రెండు భాగాల స్థాయిలో మిగిలినవి బ్లాక్ బస్టర్ కాకపోయినా కమర్షియల్ పే చేయడంతో నిర్మాతలు కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత ‘దృశ్యం 3’ వస్తుంది. మోహన్ లాల్ వెర్షన్ కి కొన్ని కీలక మార్పులు చేసి రీమేక్ చేస్తున్నారు. ఇది చూసిన నెలరోజుల లోపే ‘గోల్ మాల్ 5’ రెడీ అయిపోతుంది. రోహిత్ శెట్టి బ్రాండుతో దీనికి బిజినెస్ బాగుంటుంది. ‘సైతాన్ 2’కి అజయ్ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
ఇవి కాకుండా వచ్చే ఏడాది కూడా ముందుగానే లాక్ చేసి పెట్టుకుంటున్నారు అజయ్ దేవగన్. ఎప్పుడో ఏడాది తర్వాత రిలీజయ్యే ‘చౌహన్’కు తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ‘రేంజర్’ కూడా నిర్మాణంలో ఉంది. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. రైడ్ 2,. దే దే ప్యార్ దే 2, సన్నాఫ్ సర్దార్ 2 తో సీక్వెల్స్ ప్రహసనం కొనసాగించిన సంగతి తెలిసిందే. వీటిలో మొదటిది తప్ప మిగిలిన రెండు ఫెయిలయ్యాయి. అయినా సరే అజయ్ దేవగన్ ఈ కొనసాగింపుల పర్వం ఆపేలా లేరు.
ఇతని గురించి మనం ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తోందంటే ఇలాంటి వేగం మన హీరోలు కూడా అందిపుచ్చుకోవాలి. పట్టుమని పాతిక కోట్లు మార్కెట్ లేని అప్ కమింగ్ హీరోలు కూడా వరల్డ్ బైలింగ్ పేరుతో అనవసరంగా సమయాన్ని వృధా చేస్తూ ఎంటర్ టైనర్స్ కి దూరమైపోతున్నారు. అలాని అందరూ సక్సెస్ కొడుతున్నారా అంటే అదీ లేదు. ముప్పాతిక శాతం ఫ్లాపులే ఉంటున్నాయి. స్పీడ్ పెంచడం వల్ల వాళ్ళ కన్నా ఎక్కువగా పరిశ్రమకు ప్రయోజనం కలుగుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates