సూటిగా చెప్పిన సమాధానాల్లో సునీత గారి పాఠాలు

గాయని సునీత అంటే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. చిత్ర, జానకి లాంటి సీనియర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న టైంలో ‘ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో’ అంటూ యువత హృదయాలను గిలిగింతలు పెట్టడం మ్యూజిక్ లవర్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. అక్కడి నుంచి ఆవిడ వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. తెరవెనుక ఎంత పేరు తెచ్చుకున్నా వ్యక్తిగత జీవితానికి అంతే ప్రాధాన్యం ఇస్తూ వర్క్ లైఫ్ బ్యాలన్స్ కొనసాగిస్తున్న సునీత ఇటీవలే మా ప్రతినిధికి ఇచ్సిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు పంచుకున్నారు.

ముఖ్యంగా అమ్మాయిల వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ఒంటిని బహిర్గత పరుస్తూ మా శరీరం మా ఇష్టం అన్నప్పుడు, చుట్టూ ఉన్న మగాళ్లు మా కళ్ళు మా ఇష్టం అంటారని, సమానత్వం పేరుతో సిగరెట్ తాగేసి దాని అర్థం మార్చేశారని, అభిప్రాయాలకు విలువ ఇవ్వడమే నిజమైన ఈక్వాలిటీ అంటూ వివరణ ఇచ్చారు. ఇప్పుడీ మాట తాలూకు వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సునీత నుంచి ఇలాంటి ప్రతిస్పందన ఊహించని కొందరు అప్పుడే కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

ఎస్పి బాలసుబ్రమణ్యం గారికి దక్కాల్సిన గౌరవం, ఫెమినిజం. ఇండస్ట్రీలో ఎదురైన సవాళ్లు, ఆరోగ్యం విషయంలో చవిచూసిన ఇబ్బందులు, 750 పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పిన అనుభవం, లైఫ్ స్టైల్, పిల్లల పెంపకం ఇలా ఎన్నో అంశాల గురించి కూలంకుషంగా వివరించారు. ఈ మధ్య కాలంలో ఒక సింగర్ అందులోనూ ఒక మహిళా ఇంత ఓపెన్ గా చాలా ఇష్యూస్ మీద మాట్లాడ్డం అరుదని చెప్పాలి. అందుకే ఈ ముఖాముఖీ ప్రత్యేకంగా నిలుస్తోంది.

సునీత ఇప్పటికీ గాయనిగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు కానీ మునుపటి వేగంతో కాకపోయినా మంచి అవకాశాలను వదిలి పెట్టడం లేదట. కొడుకు ఆకాష్ హీరోగా చేస్తున్న ప్రయత్నాల ప్రస్తావన వచ్చినప్పుడు సక్సెస్ మన చేతిలో ఉండదని, కష్టపడుతూ ఉంటే ఏదో ఒకనాడు వచ్చి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హీరో దర్శకులు తప్ప వేరే ఇంటర్వ్యూలు కనిపించని ట్రెండ్ లో ఒక గాయని ఇలా తన అనుభవాలను రంగరించి చెప్పడం చూస్తే పాటలే కాదు సునీత గారి మాటల్లో కూడా పాఠాలు ఉంటాయని చెప్పొచ్చు.