సైలెంటుగా పరుగులు పెడుతున్న బంగారం

సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి. అన్ని కేంద్రాల మెయిన్ థియేటర్లు డెబ్భై శాతం దాకా ఆడియన్స్ ని నింపుతుండగా కింది సెంటర్స్ లో నలభై నుంచి యాభై దాకా ఈ నెంబర్ మారుతోంది. సాయంత్రం, సెకండ్ షోలు బాగా ఉన్నాయి. నిన్న వారం భయపెట్టిన వర్షాలు ఈసారి బ్రేక్ ఇవ్వడం బంగారంకు కలిసి వస్తోంది. ప్రస్తుతం డెబ్భై అయిదు కోట్లను టార్గెట్ చేసుకుంది.

ఈ వారం చెప్పుకోదగ్గ కొత్త రిలీజులు ఏమీ లేవు. హనుమాన్ 3డి, ఒక్కడు, సినిమా చూపిస్త మావా, కన్నప్పలను గంపగుత్తగా దింపుతున్నారు కానీ దేనికీ కనీస బజ్ లేదు. అసలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఫ్యాన్స్ కామెంట్స్ ఎక్స్, ఇన్స్ టాలో కనిపిస్తున్నాయి. ఉన్నంతలో హనుమాన్ టీమ్ ప్రమోషన్లు విస్తృతంగా చేస్తోంది కానీ 3డి ఎక్స్ పీరియన్స్ కోసం జనం పెద్ద ఎత్తున తరలి వస్తారా అనేది భేతాళ ప్రశ్నగా మారింది. రేపు డీసెంట్ గా ఓపెన్ అయితే మంచిదే.

ఇక మా ఇంటి బంగారం విషయానికి వస్తే శుక్రవారం మొహరం సెలవు రోజుతో కలుపుకుని మొత్తం మూడు రోజుల లాంగ్ వీకెండ్ స్వాగతం చెబుతోంది. సో సమంత మళ్ళీ వసూళ్ల ప్రవాహం కొనసాగించవచ్చు. పెద్ది ఫైనల్ రన్ కు వచ్చేసింది. ఎంతో కొంత శని ఆదివారాల్లో లాగినా మరీ చెప్పుకోదగ్గ పెద్ద నెంబర్ ఉండకపోవచ్చు. నిన్నటి సక్సెస్ మీట్ తో ప్రచార పర్వానికి అధికారికంగా చెక్ పెట్టేశారు. ఇకపై ఎలాంటి పబ్లిసిటీ యాక్టివిటీస్ కనిపించవు.

బ్రేక్ ఈవెన్ ఆల్రెడీ దాటేసిన మా ఇంటి బంగారం ఏరియాల వారిగా లాభాలు తెచ్చే పనిలో ఉంది. నిర్మాణ సంస్థ అధిక శాతం ఒన్ రిలీజ్ చేసుకోవడంతో కాసుల గలగలలు సమంత ట్రలాల సంస్థను ముంచెత్తబోతున్నాయి. ఇంకా చూడాల్సిన కుటుంబ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. టికెట్ రేట్లు పెంచుకునే గోల లేదు కాబట్టి హ్యాపీగా రెగ్యులర్ ధరలతోనే జనం ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. నెంబర్ పెరిగేందుకు దోహదం చేసిన కారణాల్లో ఇదీ ఒకటని చెప్పొచ్చు.