పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే కాదని, తెచ్చుకోవడానికి ఎన్నో దారులు ఉన్నాయని, ప్రేక్షకుల మెప్పుని పొందటం ముఖ్యమని చెప్పడం సోషల్ మీడియాలో కొన్ని వర్గాలకు ట్రిగ్గర్ అయిపోయింది. ముఖ్యంగా టాలీవుడ్ లో బెస్ట్ యాక్టర్ అవార్డు సాధించిన ఒకే నటుడు అల్లు అర్జున్ అభిమానులు ఈ స్టేట్ మెంట్ ని అపార్థం చేసుకున్న వైనం వాళ్ళు స్పందిస్తున్న విధానంలో బయట పడుతోంది.
ఇక్కడ దారులు అంటే కేవలం దొడ్డిదారులు అనే కోణంలోనే చూడాల్సిన అవసరం లేదు. ఒక ఆర్టిస్టుకి జాతీయ అవార్డు రావడానికి ఎన్ని సానుకూలతలు ఉంటాయో అన్నే ప్రతికూలతలు ఉంటాయి. టాలెంట్ తో పాటు ఒక్కోసారి టైం కలిసి రావాలి. మరోసారి బలమైన పోటీ లేకుండా ఉండాలి. లేదంటే ఆపద్బాంధవుడులో చిరంజీవి, భైరవద్వీపంలో బాలకృష్ణ, అన్నమయ్యలో నాగార్జున లాంటివాళ్లు ఎప్పుడో గెలుచుకునే వాళ్ళు. వేటూరి, సుద్దాల అశోకతేజ్ లాంటి గీత రచయితలు సాకారం చేసుకున్న స్వప్నం టాలీవుడ్ హీరోల వల్ల కాలేదు.
అందుకే పుష్పలో బన్నీ నటనకు అవార్డు ప్రకటించినప్పుడు ఇండస్ట్రీ సంతోషంగా ఫీలయ్యింది. పెద్దికి వస్తుందా రాదానే దాని మీద ఇప్పుడే డిబేట్ అనవసరం. ఇంకా ఆరు నెలలు ఉన్నాయి. రావాల్సిన సినిమాలు బోలెడు క్యూ కట్టాయి. చిరు అన్న దారులు అర్థాన్ని ప్రాక్టికల్ గా చూసుకుంటే ఆర్ట్ ఫిలిమ్స్, కమర్షియల్ హంగులు లేని ఎక్స్ పరిమెంట్లు చేస్తే అవార్డు అవకాశాలు పెరుగుతాయని. అంతే తప్ప కొనుక్కుంటేనో లాబీయింగ్ చేస్తేనో వస్తాయని కాదు.
ఆ మాటకొస్తే చిరంజీవి స్టేచర్ కి, పవన్ కళ్యాణ్ పలుకుబడికి నిజంగా అవి కావాలనుకుంటే ఎప్పుడో వాటిని కోనేసేవాళ్ళుగా. సో భూతద్దం పెట్టి చూస్తే ఒకలా, మాములుగా చూస్తే ఒకలా, ఒకే బొమ్మ రకరకాలుగా కనిపిస్తుంది. వివాదం వస్తుందని తెలిస్తే మాట్లాడే రకం చిరంజీవి కాదనేది అందరికీ తెలిసిందే. ఇదేదో సమర్ధించే ప్రయత్నం చేయడం కాదు. దారులు అన్న పదాన్ని పట్టుకుని జరుగుతున్న శల్యపరీక్షకు చిన్న క్లారిటీ. ఇంకో ఏడాది ఆగితే 2026 ఉత్తమ నటుడు ఎవరో డిసైడవుతుంది. చూద్దాం.
Gulte Telugu Telugu Political and Movie News Updates