సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న ‘ధర్మన్’ ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ క్రేజీ మూవీకి ఫైనల్ గా అశ్వత్ మారిముత్తు ఫిక్స్ అయ్యారు. గత ఏడాది ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ తో మంచి సక్సెస్ ఖాతాలో వేసుకున్న ఇతను గతంలో ఓ మై కడవులే తీసిన సంగతి తెలిసిందే. దీన్నే తెలుగులో విశ్వక్ సేన్, వెంకటేష్ కాంబోలో ఓరి దేవుడాగా అతనే రీమేక్ చేశారు. ఇవాళ ధర్మన్ ఫస్ట్ లుక్ లోనే కాన్సెప్ట్ ఏంటో చూచాయగా చెప్పేశారు.
ధర్మన్ లో రజనీకాంత్ డాక్టర్ గా నటిస్తున్నారు. అంటే డబ్బులు తీసుకుని పేషెంట్ రోగాలు నయం చేసేవాడు కాదు. అదే కత్తి పట్టుకుని హత్యలు చేయడానికి కూడా వెనుకాడని డెడ్లి వైద్యుడు. దాన్నే కాప్షన్ గా పెట్టారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చబోతున్న ఈ మూవీలో మొత్తం ఎనిమిది పాటలు ఉంటాయి. ఒకదానితో మరొకటి సంబంధం లేని ట్యూన్లతో ఒక డిఫరెంట్ ఆల్బమ్ ఇవ్వబోతున్నారట. మర్డర్లు చేసే డాక్టర్ అంటే వెరైటీగా అనిపిస్తుంది కదూ. కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం.
1992 శోభన్ బాబు హీరోగా సర్పయాగం వచ్చింది. పరుచూరి బ్రదర్స్ దర్శకత్వం వహించారు. అందులో శోభన్ బాబు మంచి పేరున్న డాక్టర్. వృత్తికి వ్యతిరేకంగా కిరాయి హంతకులను మాట్లాడుకుని తన శత్రువులను కిడ్నాప్ చేయించి వాళ్ళను తన స్వంత చేతులతో చంపేస్తాడు. ఎందుకంటే కూతురిని మానభంగం చేసి ప్రాణాలు తీసినందుకు. ఒంగోలులో జరిగిన ఒక నిజ జీవిత సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ కథను అల్లారు. కమర్షియల్ గా హిట్టు కొట్టింది.
ఇప్పుడీ ధర్మన్ అదే కాన్సెప్టని చెప్పడం లేదు కానీ పోలికలైతే కనిపిస్తున్నాయి. రజనీకాంత్ స్టయిలిష్ గా రక్తాన్ని హ్యాండిల్ చేయడం, వెనుక బ్యాక్ గ్రౌండ్ లో హాస్పిటల్ సీన్ వగైరాలన్నీ కొంచెం సర్పయాగాన్ని గుర్తు చేస్తున్నాయి. ఎందుకంటే ఈ క్యారెక్టరైజేషన్ లో స్టార్ హీరోలు సినిమాలు చేసిన దాఖలాలు తక్కువ. అందుకే ధర్మన్ ప్రత్యేకత సంతరించుకుంటోంది. 2027 విడుదల చేయబోతున్నారు. ముందు జైలర్ 2 రిలీజ్ ఫిక్స్ అవ్వాలి. తెలుగులో కూడా ధర్మన్ అని పెట్టేలా ఉన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates