ఆర్సీ 17… చెప్పనన్న సుకుమార్

హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే చివరి పబ్లిక్ ఈవెంట్ కావడంతో వాళ్ళ తాకిడి అధికంగా ఉంది. గెస్టులు ఎవరు వస్తున్నారో ముందే చెప్పేయడంతో సుకుమార్ ఎలాంటి అప్డేట్ ఇస్తారనే ఎగ్జైట్ మెంట్ తో ఫ్యాన్స్ ఎదురు చూశారు. ఊహించినట్టే ఆయన స్టేజి మీద మైకు అందుకున్నప్పుడు ఆర్సి 17 గురించి చెప్పమని చాలాసేపు అరిచి మాట్లాడకుండా చేశారు.

దానికి సమాధానంగా సుకుమార్ చాలా స్పష్టంగా నేను చెప్పను, చెప్పుకోవడం ఇష్టం ఉండదు, మీరే ఊహించుకోండి అంటూ తనదైన స్టయిల్ లో చాలా సున్నితమైన ఎలివేషన్ ఇచ్చారు. నిజానికి ఆ మూవీ గురించి ఏదైనా చెప్పడానికి వేదిక అది కాదు. ఏ చిన్న మాట చెప్పినా పెద్ది టాపిక్ పక్కకు వెళ్ళిపోయి సోషల్ మీడియాలో ఇదే హైలైట్ అవుతుంది. ఇది ముందే పసిగట్టిన సుకుమార్ అంత గోల వినిపించినా సరే చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

చిరంజీవి సినిమా ఫ్లాప్ అయితే ఆయన పడుకుంటారేమో కానీ మరో హిట్ వచ్చేవరకు మేం నిద్రపోయే వాళ్ళం కాదని చెప్పిన తీరు సగటు మాస్ అభిమాని ఎమోషన్ ని బయట పెట్టినట్టు అయ్యింది. నిజానికి ఈ కాంబో రావాలని మూవీ లవర్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కానీ పుష్పకు ఎక్కువ సమయం ఖర్చయిపోవడం తర్వాత రామ్ చరణ్ కు కమిట్ మెంట్ ఇవ్వడం వల్ల మెగాస్టార్ సుక్కు కలయిక తెరమీద చూసే అదృష్టం ఫ్యాన్స్ కి కలగడం లేదు.

ఈవెంట్ సంగతి కాసేపు పక్కనపెడితే ఆర్సి 17 ప్రారంభం కావడానికి ఇంకో నాలుగైదు నెలలు పట్టేలా ఉంది. స్క్రిప్ట్ దాదాపు సిద్ధమయ్యిందని టాక్. టైటిల్ కూడా లాక్ చేసుకున్నారట. కాకపోతే అధికారిక ప్రకటన ఇవ్వడానికి ఇంకా బోలెడు సమయం ఉంది కాబట్టి అప్పటిదాకా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి డిసెంబర్ లేదా జనవరికి సెట్స్ మీదకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రంగస్థలంని మించినది రావాలని సగటు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు.