సాయిపల్లవి చేసుంటే ఎలా ఉండేది

మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది. కాల్ షీట్స్ సమస్య కారణంగా స్టోరీని నాకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి తెరకెక్కించామని క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయ్యుంటే వేరే డిస్కషన్ ఉండేది కానీ బాక్సాఫీస్ దగ్గర బంగారం పెర్ఫార్మన్స్ చూస్తుంటే ఎవరికి నోటమాట రావడం లేదు. మూడు రోజులకే నలభై కోట్లంటే మాటలా.

ఒకవేళ సాయిపల్లవి కనక ఎస్ చెప్పి ఉంటే ఎలా ఉండదన్నది సహజంగా మూవీ లవర్స్ మదిలో మెదిలే ప్రశ్న. ప్రాక్టికల్ గా చూస్తే సమంతలో ఉండే ఒకరకమైన ఇన్నోసెన్స్, మెరిసినట్టు ఉండే స్కిన్ టోన్ సాయిపల్లవికి లేదు. నటన పరంగా పోలిక చేయకూడదు. ఎందుకంటే ఫిదా, గార్జి లాంటి వాటిలో ఇంకే ఆర్టిస్టుని ఊహించలేం. అవి తనకు మాత్రమే సొంతం. కానీ మా ఇంటి బంగారం ఒక బలమైన నేపధ్యమున్న పల్లెటూరి కుటుంబానికి సంబంధించిన కథ.

సో సమంత లుక్స్, అమాయకత్వంతో పాటు అవసరమైనప్పుడు కరుకుదనం చూపించే స్పార్క్ ఖచ్చితంగా ఆమె పోషించిన స్వర్ణ క్యారెక్టర్ కు ప్లస్ గా మారాయి. అందులోనూ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే సాయిపల్లవి అలాంటిది విరాట పర్వంలో చేసింది. కొంచెం దగ్గరి పోలికలు ఉంటాయి. అలాంటప్పుడు వద్దన్నా కంపారిజన్లు వచ్చి అభిప్రాయాలు మారిపోతాయి. సమంతకు మరీ కొత్త కాకపోయినా ఇలాంటివి అలవోకగా అల్లేసుకుంటుంది. అదే ఇప్పుడు వర్కౌట్ అయ్యింది.

ప్రతి బియ్యపు గింజ మీద తినే వాడి పేరు రాసి ఉంటుందన్నట్టు సినిమాలకు కూడా ఇదే వర్తిస్తుంది. లేదంటే ఇడియట్ లో రవితేజ, అతడులో మహేష్ బాబు బదులు ఆ రెండింటిలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించేవారు. బుచ్చిబాబు కాదని అంటున్నా పెద్ది ముందుగా వెళ్ళింది జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికే. అంతా మన మంచికే సామెత చెప్పినట్టు మా ఇంటి బంగారం సాయిపల్లవి చేజారడం కలిగిన నష్టం కన్నా అది సమంత చేయడం వల్ల కలిగిన మేలు ఎన్నోరెట్లు ఎక్కువ.