హీరోయిన్ల కలెక్షన్లతో ఫ్యాన్ వార్స్ ఏంటయ్యా…

టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ కాస్తా హీరోయిన్ల వైపు కూడా మళ్లడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రీసెంట్ గా సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ఓపెనింగ్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంత వచ్చాయి అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఒక రేంజ్ లో హడావిడి మొదలుపెట్టారు. ఇక్కడితో ఆగకుండా మిగతా స్టార్ హీరోయిన్స్ గత సినిమాల కలెక్షన్స్ ను కూడా ఈ లిస్ట్ లోకి లాగడంతో అసలు గొడవ మొదలైంది.

మా ఇంటి బంగారం కలెక్షన్స్ ను అనుష్క భాగమతి, రష్మిక ది గర్ల్ ఫ్రెండ్, కాజల్ సత్యభామ లాంటి సినిమాల ఫస్ట్ డే వసూళ్లతో పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. తమకు నచ్చిన హీరోయిన్ కు ఎలివేషన్ ఇవ్వడం కోసం వేరే నటీమణులను తక్కువ చేసి చూపిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఒకప్పుడు కేవలం గ్లామర్ కే పరిమితం అనుకున్న హీరోయిన్లు ఇప్పుడు సోలోగా మార్కెట్ క్రియేట్ చేసుకోవడం మంచి పరిణామమే అయినా.. ఇలా వాళ్ల కలెక్షన్స్ ను పట్టుకుని ఫ్యాన్ వార్స్ కి దిగడం ఇండస్ట్రీ వాతావరణానికి ఏమాత్రం సెట్ కాదు.

ఇక గమనించాల్సిన అసలు పాయింట్ ఏంటంటే నెట్టింట ఫ్యాన్స్ కొట్లాడుకుంటున్న ఈ కలెక్షన్స్ లెక్క నిజమో కాదో కూడా ఎవరికీ పక్కాగా తెలియదు. కొందరు కేవలం తెలుగు వెర్షన్ వసూళ్లు మాత్రమే చూపిస్తుంటే, కొందరు తమిళ, మలయాళ వెర్షన్ల కలెక్షన్స్ ను కూడా కలిపేసి లెక్కలు చెబుతున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్స్ లేకుండానే ఎవరికి వారు ఫేక్ నెంబర్స్ వేసుకుని, వాటినే నిజమని నమ్ముతూ గంటల తరబడి ఆన్లైన్ లో కొట్టుకుంటున్నారు. ఈ కల్పిత నెంబర్ల గోల చూసి సాధారణ ప్రేక్షకులు కూడా కాస్త విసిగిపోతున్నారు.

వాస్తవానికి కంటెంట్ బేస్డ్ మహిళా ప్రధాన చిత్రాలు రావడం, అవి సక్సెస్ అవ్వడం టాలీవుడ్ కు చాలా అవసరం. సినిమా బాగుంటే ఆడియన్స్ కచ్చితంగా థియేటర్లకు వచ్చి ఆదరిస్తారు. అంతేతప్ప ఇలాంటి ప్రాక్టికల్ కాని విషయాలను పట్టుకుని సోషల్ మీడియాలో రచ్చ చేయడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. తెలుగు యువత ఈ ట్రెండ్ ను ఎంకరేజ్ చేయకుండా, కేవలం సినిమాలను సినిమాల్లాగా ఎంజాయ్ చేస్తే మంచిదని మరికొందరు నెటిజన్లు చెబుతున్నారు.