సెన్సార్ చిక్కులు చిన్న సినిమాలకేనా

వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా తారతమ్యం ప్రేక్షకులకు ఉండాలి కానీ ఇండస్ట్రీ, సెన్సార్ బోర్డుకు కాదు. కానీ అదేంటో ఈ మధ్య ట్రెండ్ గమనిస్తే చిన్న చిత్రాల విషయంలో అభ్యంతరాలు ఎక్కువైపోయి, చివరి నిమిషం ఒత్తిళ్లను భరించలేక నిర్మాతలు నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. గత ఏడాది కాలంగా ఈ ధోరణి మరింత ఎక్కువ కావడం పరిశ్రమ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది.

తాజాగా విడుదలైన ‘దీవానా’కు యు/ఏ కోసం టీమ్ ఎంతో ప్రయత్నించింది. అధికారులు అభ్యంతరం చెప్పిన ఒక సీన్ తీసేసింది. అయినా కూడా అడల్ట్స్ ఓన్లీ ఇచ్చారు. ఫలితంగా తీవ్రంగా అభ్యంతరం చెప్పే అసభ్యత లేకపోయినా పద్దెనిమిది లోపు వాళ్లకు సినిమా చూసే అవకాశం లేకుండా పోయింది. ఒక రోజు ఆలస్యం అయ్యింది. ఇంతకు ముందు వరలక్ష్మి శరత్ కుమార్ ‘సరస్వతి’ ముందు ఎస్ జోడిస్తే తప్ప క్లియరెన్స్ రాలేదు. ఇదో సాధారణ క్రైమ్ థ్రిల్లర్. శివాజీ ‘దండోరా’ రిలీజ్ టైంలో దక్కిన ఒత్తిడి అంతా ఇంతా కాదు.

ఇవే కాదు హే భగవాన్, చాయ్ వాలా లాంటివి పేర్లు మార్చుకుంటే తప్ప ల్యాబ్స్ నుంచి బయటికి రాలేదు. ‘కపుల్ ఫ్రెండ్లీ’ బృందం చిన్నపాటి యుద్ధం చేయాల్సి వచ్చిందని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకోవడం అభిమానులకు గుర్తే. ‘మోగ్లీ’ సైతం కొన్ని చిక్కులు చవి చూసింది. ఇంత తీవ్రమైన సమస్య పెద్ద సినిమాలకు పెద్దగా రాకపోవడం గమనించాల్సిన విషయం. ఒకవేళ వాటికి ఏ సర్టిఫికెట్ ఇచ్చినా వసూళ్లకు ఢోకా ఉండదు. యానిమల్, సలార్ లాంటి ఉదాహరణలు చాలు.

కానీ చిన్న సినిమాలకు అలా కుదరదు. A ముద్ర చూసి ఆగిపోయేవాళ్లు ఉంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి రకరకాల అనుమానాలు వస్తాయి. ఇది ఇప్పటి కథ కాదు. మాలపిల్ల, మా భూమి నుంచి ఇప్పటిదాకా కొన్ని వందల సినిమాలు ఈ ఆంక్షల వల్ల ఇబ్బందులు చవి చూశాయి. మరీ కఠినంగా ఉండి చివరి నిమిషంలో ఇబ్బంది పెట్టవద్దని నిర్మాతలు కోరుకుంటున్నారు. ఈ లెక్కన రిలీజ్ కు కనీసం రెండు వారాల ముందు సెన్సార్ చేసుకుంటే తప్ప దీనికి పరిష్కారం దొరికేలా లేదు.