రక్తచరిత్రని మళ్ళీ చూస్తారా

శివ, క్షణక్షణం, సత్య, రంగీలా లాంటి సినిమాలతో కల్ట్ మేకర్ అనిపించుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫామ్ తగ్గిపోయిన టైంలో ఆయన సత్తా మళ్ళీ చూపించిన మూవీ రక్తచరిత్ర. అనంతపూర్ ఫ్యాక్షనిజం ఆధారంగా చేసుకుని పరిటాల రవి జీవిత చరిత్రను తెరకెక్కించిన తీరు అప్పట్లో సంచలనం రేపింది. వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్ర పోషించగా ఇందులో వయొలెన్స్, ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్, నిజ జీవిత పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్టయ్యాయి.

ఇదంతా జరిగి పదహారు సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు రీ రిలీజుల ట్రెండ్ నడుస్తున్న టైంలో రక్తచరిత్ర మళ్ళీ థియేటర్లకు వస్తోంది. వచ్చే నెల విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే వినడానికి బాగానే ఉన్నా రక్తచరిత్రని మళ్ళీ అదే స్థాయిలో ఆదరిస్తారానేది వేచి చూడాలి. ఎందుకంటే వర్మ హిట్ చిత్రాలు సత్య, రంగీలా ఆ మధ్య 4కె చేయించి రిలీజ్ చేస్తే నార్త్ ఆడియన్స్ అంతగా పట్టించుకోలేదు. సోసో వసూళ్లు వచ్చాయి.

అలాంటిది రక్తచరిత్రని చూస్తారా అంటే ఔననే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఎక్కడ లేనట్టు తెలుగు రాష్ట్రాల్లోనీ రీ రిలీజులు బాగా ఆడుతున్నాయి. అందులోనూ మాస్ ఎలివేషన్లు ఉండే కంటెంట్లకు డబ్బులు వస్తున్నాయి. అయితే రక్తచరిత్రలో ఒక సమస్య ఉంది. ఇందులో స్టార్లు లేరు. టైటిల్ సాంగ్ తప్ప ఊపు ఇచ్చే పాటలు, డాన్సులు ఉండవు. కేవలం హత్యలు, తిట్టుకోవడాలు, అరుచుకోవడాలు, కత్తులు, తుపాకులు ఉంటాయి. వీటిని చూసేందుకు వస్తారా అంటే చెప్పలేం.

అయినా గ్యాప్ లేకుండా ఇలా పాత సినిమాలన్నీ నెలకో నాలుగైదు రిలీజ్ చేసే ఈ ట్రెండ్ ని ఎప్పుడు ఆపుతారో అంతు చిక్కడం లేదు. ఇది చాలదన్నట్టు గతంలో రీ రిలీజ్ చేసినవి కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ వేస్తున్నారు. ఉండబట్టలేక అభిమానులు జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు. మరి రక్తచరిత్ర ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ఇతర చోట్ల ఏమో కానీ సీడెడ్ లో మాత్రం మంచి ఆదరణ దక్కేలా ఉంది. రక్తచరిత్ర కథ మొత్తం అక్కడే తిరుగుతుంది కాబట్టి.