రష్మిక మందన్న ‘కాక్ టైల్ 2’ ఎలా ఉంది

బాలీవుడ్ మీద గట్టి దృష్టి పెట్టిన రష్మిక మందన్న అక్కడి నుంచి వచ్చిన అవకాశాలను అంత తేలికగా వదిలిపెట్టడం లేదు. డెబ్యూలు తేడా కొట్టినా యానిమల్ ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ ఇచ్చింది. రన్బీర్ కపూర్ ఎంత వన్ మ్యాన్ షో చేసినా తన ఉనికిని చాటుకోవడంలో రష్మిక సక్సెస్ అయ్యింది. చావా రూపంలో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న శ్రీవల్లి పుష్ప 2 రూపంలో నార్త్ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యింది. సల్మాన్ ఖాన్ సికందర్ ఒకటే దారుణంగా దెబ్బ తింది.

తాజాగా కాక్ టైల్ 2 తో మరోసారి హిందీ ఆడియన్స్ ని పలకరించింది రష్మిక మందన్న. రివ్యూలు అధిక శాతం నెగటివ్ గా ఉన్నప్పటికీ వసూళ్లు స్టడీగా ఉండటం గమనార్హం. షాహిద్ కపూర్ ఇమేజ్, హీరోయిన్ల గ్లామర్ జనాన్ని బాగానే లాక్కొస్తున్నాయి. అయితే రష్మిక కన్నా కృతి సనన్ ఎక్కువ హైలైట్ కావడం గురించి ముంబై మీడియా ప్రత్యేకంగా ప్రస్తావిస్తోంది. ఆమె చేసిన గ్లామర్ షో కూడా ఓ రేంజ్ లో ఉండటంతో క్రిటిక్స్ వాటి విజువల్స్ ని ఆహా ఓహో అంటూ పొగిడేస్తున్నారు.

కాక్ టైల్ 2 ఒక విచిత్రమైన కథ. షాహిద్ కపూర్ తో సహజీవనం చేస్తున్న రష్మిక మందన్న విదేశాలకు వెళ్ళినప్పుడు తన ప్రియుడుకి ఎంత నిజాయితీ ఉందో తెలుసుకోవడానికి అక్కడ ఉంటున్న ఫ్రెండ్ కృతి సనన్ సహాయం అడుగుతుంది. సరదాగా అనుకున్న పరీక్ష కాస్త విచిత్రమైన మలుపులకు దారి తీస్తుంది. లేనిపోని కన్ఫ్యూజన్లు తలెత్తుతాయి. కోరి మరీ గందరగోళం తెచ్చుకున్న ఈ ముగ్గురు చివరికి తమ కాక్ టైల్ ప్రయాణాన్ని ఏ తీరానికి చేర్చారనేది అసలు స్టోరీ.

జెన్ జీని టార్గెట్ చేసి తీసిన కాక్ టైల్ 2 చాలా ఓపికను డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ ని ఎంతో సహనం ఉంటే తప్ప భరించడం కష్టం. రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో ఎమోషన్లు తక్కువ మోతాదులో ఉండాలి. ఇందులో ఎక్కువ పెట్టేయడంతో ఒకదశలో చిరాకు పుడుతుంది. ఆర్టిస్టుల ప్రాధాన్యత క్రమం చూసుకుంటే షాహిద్, కృతి సనన్ తర్వాతే రష్మిక మందన్న నిలుస్తుంది. హిట్టు క్యాటగిరీలో పడుతుందా లేదానేది ఒక వారం వసూళ్లను విశ్లేషించుకున్నాక క్లారిటీ వస్తుంది.