‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు ‘ఓం’గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా ఒక్క భాగంగా రావడం లేదు. సీక్వెల్ కూడా ఉంది. కెజిఎఫ్ తరహాలో చాప్టర్ 1గా దీన్ని అక్టోబర్ 16 విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ టీజర్ రూపంలో వదిలారు. కన్నడలో శివరాజ్ కుమార్ కల్ట్ బ్లాక్ బస్టర్ పేరు ఓంని మళ్ళీ ముప్పై సంవత్సరాల తర్వాత ధనుష్ వాడుకోవడం విశేషం.

ఇక వీడియో విషయానికి వస్తే రెండున్నర నిమిషాల టీజర్ లాంటి ఎపిసోడ్ లో దర్శకుడు తన ఉద్దేశాన్ని చెప్పీ చెప్పకుండా చెప్పాడు. రాత్రిపూట అడవిలో భోరున వర్షం కురుస్తున్న టైంలో అమాయకులతో నిండిన ఒక గుంపుని చంపేందుకు ఆర్మీ దుస్తుల్లో ఉన్న వాళ్ళు సిద్ధమవుతారు. సరిగ్గా అప్పుడే ఒక గొడ్డలి వచ్చి మధ్యలో నిలబడుతుంది. అది విసిరింది ధనుష్. అసలు అక్కడ సామూహిక హత్యలు ఎందుకు ప్లాన్ చేశారు, హీరో ఎందుకు వచ్చాడనేది అసలు స్టోరీ.

టీజర్ లో ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకున్నారో స్పష్టంగా కన్వే కాలేదు. ధనుష్ ఎప్పటిలాగే అన్నార్తుల పాలిట ఆవేశం నిండిన ఆపద్బాంధవుడి పాత్రను మరోసారి రిపీట్ చేశాడు. చెన్నై వర్గాల ప్రకారం ఇది శ్రీలంక తమిళుల నేపథ్యంలో ఎల్టిటిఈ కథాంశంగా రూపొంది ఉండొచ్చని అంటున్నారు. అదే నిజమైతే అన్ని బాషల ఆడియన్స్ ని మెప్పించడం అంత సులభంగా ఉండదు. ఓంలో మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల లాంటి క్రేజీ క్యాస్టింగ్ పెద్దదే అయింది.

ఓం పెద్ద హిట్ కావడం ధనుష్ కు చాలా అవసరం. ఎంతో గొప్పలు చెప్పుకున్న కర బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యింది. అంతకు ముందు ఇడ్లి కొట్టు తమిళంలో ఓ మోస్తరుగా ఓకే అనిపించుకోగా ఇతర చోట్ల డిజాస్టర్ అయ్యింది. అయితే అమరన్ దర్శకుడు హ్యాండిల్ చేస్తుండటం వల్ల ఓం మీద అంచనాలు పెట్టుకోవచ్చనే ఉంది. అనిరుద్ తర్వాత అంతటి సెన్సేషన్ సృష్టిస్తాడని నమ్మకం ఏర్పరుచుకున్న సాయి అభ్యంక్కర్ ఈ ఓంకి సంగీతం సమకూర్చడం విశేషం.