వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి అనుకున్నట్లే మల్టీస్టారర్ ను పట్టాలెక్కించారు. ఈ ప్రాజెక్ట్ ఉదయమే పూజా కార్యక్రమాలతో అధికారికంగా మొదలైంది. ఇక మరో 4 రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి నవంబర్ కల్లా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను 2027 సంక్రాంతి బరిలో దించాలని గట్టి టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు మీద ముగ్గురు మాత్రం భారీ ఆశలే పెట్టుకున్నారు.
ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి మామూలు ఫామ్ లో లేడు. గత ఏడాది వెంకటేష్ తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో చేసిన మన శంకర వరప్రసాద్ కూడా పెద్ద సక్సెస్ సాధించింది. వరుస విజయాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న అనిల్ ఇప్పుడు తన లక్కీ సీజన్ అయిన సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఈ కథను సిద్ధం చేశాడు.
ఈ ప్రాజెక్ట్ లో వెంకటేష్ ట్రాక్ రికార్డ్ గురించి ఎవరికీ ఎలాంటి టెన్షన్ లేదు. కానీ కళ్యాణ్ రామ్ పరిస్థితి మాత్రం కాస్త భిన్నంగా ఉంది. బింబిసార లాంటి భారీ సక్సెస్ తర్వాత ఆయన చేసిన మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అసలు అనిల్ రావిపూడిని పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేసిందే కళ్యాణ్ రామ్. ఆ కృతజ్ఞతతో ఎలాగైనా తన ఫస్ట్ హీరోకు ఒక సాలిడ్ కమ్ బ్యాక్ హిట్ ఇవ్వాలనే పట్టుదలతో అనిల్ ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
ఇక హీరోయిన్ల కెరీర్ గ్రాఫ్ చూసుకున్నా ఈ ప్రాజెక్ట్ వాళ్లకు చాలా కీలకంగా మారింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన నటిస్తున్న కీర్తి సురేష్ కు బాక్సాఫీస్ వద్ద చాలా గ్యాప్ వచ్చింది. ఆమెకు పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ పడి చాలా కాలం అవుతోంది. దీంతో అనిల్ మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ తన కెరీర్ కు మళ్లీ మంచి బూస్ట్ ఇస్తుందని ఆమె బలంగా నమ్ముతోంది.
మరోవైపు కళ్యాణ్ రామ్ కు జోడీగా నటిస్తున్న కృతి శెట్టి పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. కెరీర్ స్టార్టింగ్ లో ఉప్పెన లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత మళ్ళీ అలాంటి హిట్ పడింది లేదు. రీసెంట్ గా ఆమె చేసిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దీంతో మళ్లీ ఒక భారీ సక్సెస్ కోసం ఈ భామ ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ఈ సంక్రాంతి ప్రాజెక్ట్ వర్కౌట్ అయితే కృతి శెట్టి కెరీర్ మళ్లీ ఫామ్ లోకి రావడం ఖాయం.
ఫైనల్ గా ఈ సినిమాలో వెంకటేష్ మినహా కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి ముగ్గురూ హిట్ కోసం గట్టిగా ఎదురుచూస్తున్నారు. వీళ్ల ఆశలన్నీ ఇప్పుడు అనిల్ మార్క్ మేకింగ్ మీదే ఉన్నాయి. అపజయం లేని దర్శకుడు కాబట్టి కెరీర్ ని మళ్ళీ ఒక ట్రాక్ లోకి తెచ్చుకోవడానికి ఇది బెస్ట్ ఛాన్స్ అని చెప్పవచ్చు. జీ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates