ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ డైౌరెక్టర్ ఎవరు అని పోల్ పెడితే.. తిరుగులేని ఆధిక్యంతో క్రిస్టోఫర్ నోలనే గెలుస్తాడు అనడంలో సందేహం లేదు. ‘మొమెంటో’ మొదలుకుని.. ‘ఆపెన్ హైమర్’ వరకు అతను తీసిన ప్రతి సినిమా ఒక కళాఖండమే. సినిమా సినిమాకూ ఇంతింతై అని ఎదిగిపోతూ.. వరల్డ్ వైడ్ తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారాయన.
నోలన్ సినిమాలను గొప్పగా సెలబ్రేట్ చేసే దేశాల్లో ఇండియా కూడా ఒకటి. మూడేళ్ల ముందు ‘ఆపెన్ హైమర్’ రిలీజైనపుడు మన దేశంలో ఎంత హంగామా నెలకొందో తెలిసిందే. ఆ సినిమా నోలన్ ముందు చిత్రాల స్థాయిలో థ్రిల్లింగ్‌గా లేకపోయినా అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీని తర్వాత నోలన్ రూపొందించిన ‘ది ఒడిస్సీ’కి హైప్ మామూలుగా లేదు. వచ్చే నెల 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈసారి తనదైన శైలిలో సైన్స్ ఫిక్షన్ జోడించి వార్ నేపథ్యమున్న కథతో నోలన్ వస్తుండడంతో ‘ది ఒడిస్సీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు సాధిస్తుందని అంచనా వేస్తున్న ఈ సినిమాకు ముందే వరల్డ్ వైడ్ కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో ప్రిమియర్స్ వేయబోతున్నారు. అందులో మన ముంబయి కూడా ఉండడం విశేషం. న్యూయార్క్, పారిస్, లండన్‌లతో పాటుగా ముంబయిని ప్రిమియర్స్ కోసం నోలన్ ఎంచుకోవడంతో ఆయన ఇండియాకు ఇచ్చే ప్రాధాన్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
స్వయంగా నోలన్ ఈ ప్రిమియర్‌కు హాజరయ్యే అవకాశముంది. నోలన్ సినిమాలకు మొత్తంగా జరిగే బిజినెస్‌తో పోల్చి చూస్తే… ఇండియాలో వచ్చేది కొంతే. కానీ ఇక్కడి సినీ ప్రియులు తన మీద చూపించే ప్రేమను అర్థం చేసుకోవడం, ఇంకా ఇక్కడ మార్కెట్‌ను విస్తరించే అవకాశం ఉందని నమ్మడం.. ప్రిమియర్ కోసం ముంబయిని నోలన్ ఎంచుకోవడానికి కారణం కావచ్చు. ఇది ఇండియాకు దక్కిన గౌరవంగా భావించవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates