వారణాసి లెక్కలు వేరే ఉన్నాయి

వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానున్న వారణాసి నుంచి ఇప్పుడప్పుడే అప్డేట్స్ వచ్చేలా లేవు కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రచారాలు సోషల్ మీడియాలో జోరుగా ఉన్నాయి. వాటిలో ఓటిటిలో డీల్ ఒకటి. నిర్మాతలు హక్కుల రూపంలో ఆశిస్తున్న నాలుగు నుంచి అయిదు వందల కోట్ల ధరను ఒప్పుకునేందుకు పెద్ద సంస్థలు సైతం జంకుతున్నాయని, అందుకే రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం ద్వారా సెటిల్ చేసే పనులు మొదలుపెట్టారని గాసిప్స్ తిరుగుతున్నాయి.

అయితే కేవలం ఈ ఒక్క అంశం రాజమౌళిని ఒత్తిడిలోకి నెట్టేస్తుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే వారణాసిని ఎలా మార్కెట్ చేయాలనే దాని మీద కార్తికేయతో కలిసి అయన మంచి ప్లానింగ్ లో ఉన్నారు. అంతర్జాతీయ టైఅప్స్ కోసం సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటిటిలు అంత పెద్ద మొత్తం ఇస్తాయా లేదానేది మ్యాటర్ కాదు. ఒకవేళ అంత కాకపోయినా సగం వచ్చినా చాలు, మిగిలింది ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎలా రాబట్టుకోవాలనే క్లారిటీ జక్కన్న దగ్గర ఉంటుంది.

ఒకప్పటిలా ఓటిటి సంస్థలు ప్రొడ్యూసర్లు చెప్పిన రేటుకు వెంటనే కొనేయడం లేదు. సవాలక్ష కండీషన్లు పెడుతున్నారు. స్వయంభు, విశ్వంభర, సంబరాల ఏటిగట్టులో ప్రామిసింగ్ కంటెంట్ ఉన్నప్పటికి డిజిటల్ డీల్స్ వల్లే రిలీజ్ డేట్లు నిర్ణయించుకోలేక పోతున్నాయని ఇప్పటికే టాక్ ఉంది. అవి హీరోల ఇమేజ్ మించి ఖర్చు పెట్టినవి అనుకున్నా, వారణాసికి ఆ సమస్య లేదు. జక్కన్న బ్రాండ్ మీద అమెరికా నుంచి అనకాపల్లి దాకా బయ్యర్లు ఎగబడతారు.

అసలు వారణాసి ప్రొడక్షన్ ఖర్చు ఎంతో ఇప్పటిదాకా బయటికి రాలేదు. వెయ్యి కోట్లని బయట అంటున్నారు కానీ ఆ నెంబర్ ని రాజమౌళి అధికారికంగా చెప్పరు. ఆర్ఆర్ఆర్ విషయంలోనూ ఇది జరిగింది. ఒకవేళ వెయ్యి అంకె నిజమే అనుకున్నా అంత మొత్తం కేవలం థియేటర్ నుంచి రికవరీ కావడం అసాధ్యం కాదు. పుష్ప, దురంధర్ లాంటివి అలవోకగా సాధించాయి.. వాటితో వారణాసికి పోలిక అవసరం లేదు. సింపుల్ పాజిటివ్ టాక్ చాలు వందల కోట్లు దున్నేయడానికి.