స‌మంత స్టార్ ప‌వర్ క‌నిపిస్తోంది

తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్ల‌కు మాత్ర‌మే సాధ్య‌మైన స్టార్ ఇమేజ్ సంపాదించింది స‌మంత‌. విజ‌య‌శాంతి, అనుష్క‌ల త‌ర్వాత హీరోల‌తో స‌మానంగా స్టార్ ఇమేజ్ తెచ్చుకుని ఎక్కువ సంఖ్య‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన క‌థానాయిక స‌మంత‌నే. ఓ బేబీ, యుట‌ర్న్, య‌శోద లాంటి సినిమాలు ఆమె స్టార్ ప‌వ‌ర్ ఏంటో చూపించాయి. కానీ శాకుంత‌లం ఆమెకు పెద్ద షాకే ఇచ్చింది. ఆ త‌ర్వాత సామ్ కెరీర్లో గ్యాప్ వ‌చ్చింది.

దీంతో మ‌ళ్లీ ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తే ఏమాత్రం స్పంద‌న ఉంటుందో అన్న సందేహాలు క‌లిగాయి. కానీ సామ్ ఇమేజ్ చెక్కు చెద‌ర‌లేద‌ని, ఆమె లీడ్ రోల్ చేసిన‌ సినిమాపై ప్రేక్ష‌కుల్లో బాగానే ఆస‌క్తి ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. సామ్ కొత్త చిత్రం మా ఇంటి బంగారం మీద ఇటు ఆడియ‌న్స్, అటు డ్రేట్‌లో మంచి అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి.

ఈ శుక్ర‌వారం దాదాపు అర‌డ‌జ‌ను సినిమాలు రిలీజ్ కాబోతుండ‌గా.. వాటిలో స‌మంత సినిమానే క్రేజ్ ప‌రంగా లీడ్ తీసుకుంటోంది. ఈ చిత్రానికి ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ మొద‌లుపెట్టగా.. రెస్పాన్స్ చాలా బాగుంది.
హైద‌రాబాద్‌లో ప్రైమ్ మ‌ల్టీప్లెక్సుల్లో తొలి రోజు షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. ఏఎంబీ సినిమాస్, ప్ర‌సాద్ మ‌ల్టీప్లెక్స్, ఏఏఏ, ఏఆర్టీ.. ఇలా టాప్ మ‌ల్టీప్లెక్సుల‌న్నింట్లో టికెట్లు జోరుగా తెగుతున్నాయి.

కొన్ని షోలు సోల్డ్ ఔట్ స్టేజ్‌లో ఉన్నాయి. హైద‌రాబాద్‌లో ఒక స్టార్ హీరో సినిమా రేంజిలో మా ఇంటి బంగారం చిత్రానికి షోలు ఇచ్చారు. రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డేస‌రికి ఆక్యుపెన్సీలు మ‌రింత పెరుగుతాయ‌ని భావిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు వైడ్ రిలీజ్ ద‌క్కుతోంది.

మేజ‌ర్ సిటీస్‌లో తొలి వీకెండ్లో మంచి వ‌సూళ్లు వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. టాక్ బాగుంటే సినిమా రేంజే వేరుగా ఉండొచ్చు. యుఎస్‌లో కూడా సినిమాకు మంచి రెస్పాన్సే ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించ‌డ‌మే కాక‌.. నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రించాడు స‌మంత భ‌ర్త రాజ్ నిడిమోరు.