ఇండియాలో ఆల్ టైం రికార్డు దిశ‌గా అబ్సెష‌న్

కేవ‌లం ప‌ది కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సినిమా.. అబ్సెష‌న్. ఈ హాలీవుడ్ హార్ర‌ర్ మూవీ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి వ‌ర‌ల్డ్ వైడ్ రేపుతున్న సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. పెట్టుబ‌డి మీద ఏకంగా 200 రెట్ల‌కు పైగా ఆదాయాన్ని తెచ్చిపెట్టిందీ సినిమా. ముందు వెయ్యి కోట్ల మార్కును అందుకుంది. త‌ర్వాత రెండు వేల కోట్ల మైలురాయిని కూడా దాటేసింది. ఇంకా ఈ చిన్న సినిమా సంచ‌ల‌నాల‌కు తెర‌ప‌డ‌లేదు. ఇప్ప‌టికీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంచి వ‌సూళ్లు రాబ‌డుతోంది.

ఇండియాలో కూడా అబ్సెష‌న్ సంచ‌ల‌నాలు మామూలుగా లేవు. నెమ్ద‌మిగా మొద‌లై దేశ‌వ్యాప్తంగా హౌస్ ఫుల్ వ‌సూళ్ల‌తో ర‌న్ అవుతోంది. ఇప్ప‌టికే ఇండియాలో ఈ చిత్రం రూ.70 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం విశేషం. మ‌న దేశంల అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన హాలీవుడ్ హార్ర‌ర్ చిత్రాల్లో అబ్సెష‌న్ రెండో స్థానానికి చేరుకుంది. ఈ క్ర‌మంలో ఫైన‌ల్ డెస్టినేష‌న్-బ్ల‌డీనెస్ చిత్రాన్ని అబ్సెష‌న్ దాటేసింది.

ఇక అబ్సెష‌న్ ముందు ఉన్న‌ది కంజూరింగ్-ది లాస్ట్ రైట్స్ మాత్ర‌మే. గ‌త ఏడాది విడుద‌లైన ఆ చిత్రం రూ.82 కోట్ల మేర వ‌సూళ్లు రాబ‌ట్టి ఇండియాలో హైయెస్ట్ గ్రాసింగ హాలీవుడ్ హార్రర్ మూవీగా నిలిచింది. అబ్సెష‌న్ థియేట్రిక‌ల్ ర‌న్ ఇంకా ముగియ‌లేదు. మే 15న విడుద‌లైన ఈ చిత్రం నెల త‌ర్వాత కూడా చెప్పుకోద‌గ్గ వ‌సూళ్లు సాధిస్తూనే ఉంది. ప్ర‌తి వీకెండ్లో సినిమాకు మంచి ఆక్యుపెన్సీలు వ‌స్తున్నాయి. కాబ‌ట్టి ఫుల్ ర‌న్లో కంజూరింగ్ రికార్డును కూడా ఈ చిత్రం బ‌ద్ద‌లు కొట్టొచ్చు.

సినిమా మీద పెట్టిన పెట్టుబ‌డి మీద ఇండియాలోనే ఏడెనిమిది రెట్లు వ‌సూలు చేయ‌డ‌మంటే ఈ సినిమా ఏ స్థాయి స‌క్సెస్ అన్న‌ది అర్థం చేసుకోవ‌చ్చు. బ‌డ్జెట్ హంగులు, స్టార్ ప‌వ‌ర్ కంటే కంటెంట్ ఎంత ముఖ్య‌మో చెప్ప‌డానికి అబ్సెష‌న్ కంటే గొప్ప ఉదాహ‌ర‌ణ మ‌రొక‌టి ఉండ‌దు. ఇటీవ‌ల తెలుగమ్మాయి ఐశ్వ‌ర్యా రాజేష్ కూడా ఒక ప్రెస్ మీట్లో అబ్సెష‌న్ గురించి ప్ర‌స్తావిస్తూ.. ఈ విష‌యాన్ని హైలైట్ చేసే ప్ర‌య‌త్నం చేసింది.