హీరోల ఫ్రెండ్ షిప్ గురించి చర్చలెందుకు

సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం పట్ల సోషల్ మీడియాలో డిబేట్ లాంటిది జరుగుతోంది. దానికి కౌంటర్ గా తారక్ అభిమానులు మరి డ్రాగన్ టీజర్ వచ్చినప్పుడు చరణ్ ఏమి చెప్పలేదుగా అంటున్నారు. సినిమాకు, ట్రైలర్ కు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది, రెండింటిని ఒకే గాటన కట్టకూడదనేది నిజమే కాబట్టి అసలు ఈ డిస్కషన్ వల్ల ఏ మేరకు ఉపయోగముందో చూద్దాం.

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ టైం లో చరణ్, తారక్ ఇద్దరూ తమ మధ్య ఎంత స్నేహం ఉందో చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. అలాని వీళ్ళ ఫ్రెండ్ షిప్ కేవలం రాజమౌళి కోసం సృష్టించబడింది కూడా కాదు. జూనియర్ ఎన్టీఆర్ బాద్షా ఓపెనింగ్ కు వచ్చి క్లాప్ కొట్టింది చరణే. రంగస్థలంలో అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చాడని చిట్టిబాబుని పొగిడింది తారకే. సో లోలోపల వాళ్ళ బాండింగ్ బలంగా ఉందనేది పలు సందర్భాల్లో బయట పడుతూ వచ్చింది.

సరే ఇప్పుడు పెద్దిని మెచ్చుకోలేదు కాబట్టి ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలు వచ్చాయేమో అనుకోవడానికి లేదు. ఎందుకంటే డ్రాగన్ లో బిజీగా ఉన్న తారక్ అసలు సినిమాని చూశాడో లేదో, ఆఘమేఘాల మీద చూసేంత టైం ఉందో లేదోననేది యంగ్ టైగర్ ఫ్యాన్స్ చెబుతున్న వర్షన్. సింగ్ గీతంకి చాలా మంచి సెలబ్రిటీలు ట్వీట్లు పెట్టడానికి ఒకే కారణం దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు. సినిమా చూడకపోయినా ఆయన మీద గౌరవంతో మద్దతు తెలిపారు.

ఇవి తవ్వేకొద్దీ ఎక్కడికో వెళ్తాయి. నీహారిక తీసిన రాకాసకు పెదనాన్న చిరంజీవి మద్దతు పెద్దగా కనిపించలేదు. బాలయ్య సినిమాలు విడుదలైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నుంచి రెస్పాన్స్ ఉండదు. అదే విధంగా బాలకృష్ణ కూడా అన్నకొడుకు ప్రస్తావన తీసుకొచ్చిన దాఖలాలు ఈ మధ్య లేవు. ఇవన్నీ స్టార్ల అంతర్గత వ్యవహారాలు. ఫ్యాన్స్ చూడాల్సింది సినిమాలు బాగున్నాయా, ఆడుతున్నాయా లేదా. అంతే తప్ప ఫలానా వాళ్ళు గ్రీటింగ్స్ చెప్పారా లేదాని కాదు. వాటి వల్ల ఫలితాలు మారిపోవు.