హ్యాపీ దెబ్బకు ఆర్య బయటికి వస్తున్నాడు

మన హీరోల పాత రీ రిలీజులు తెలుగు రాష్ట్రాల్లో ఆడటం పెద్ద విషయం కాదు. చాలాసార్లు చూశాం. పోకిరి, ఖుషి లాంటి బ్లాక్ బస్టర్లను ఎగబడి చూశారు. ఖలేజా, ఆరంజ్ లాంటి డిజాస్టర్లకు కనకవర్షం కురిపించారు. అలాని ప్రతిదీ ఆడలేదు. కొన్ని ఇండస్ట్రీ హిట్లను జనం పట్టించుకోని దాఖలాలు కూడా ఉన్నాయి. సరే ఇవన్నీ టాలీవుడ్ స్టార్లవి కాబట్టి చూసినా చూడకపోయినా అవన్నీ మనకు సంబంధించిన వ్యవహారాలు. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లెక్కలు వేరే ఉన్నాయి.

ఇటీవలే కేరళలో విడుదలైన హ్యాపీ కేవలం నాలుగు రోజులకే కోటి రూపాయలు వసూలు చేయడం చూసి ట్రేడ్ మతి పోయింది. ఎందుకంటే తెలుగు టయర్ 1 స్టార్ హీరోల కొత్త సినిమాలకే అంత ఓపెనింగ్స్ రావు. అలాంటిది హ్యాపీ లాంటి ఇరవై ఏళ్ళ ఫ్లాప్ మూవీకి ఇంత ఆదరణ దక్కడం అనూహ్యం. షాక్ కొట్టే మరో విషయం ఏంటంటే కొన్ని సెంటర్స్ లో అర్ధరాత్రి షోలు వేస్తే అవి కూడా ఫుల్ అయిపోతున్నాయి. వెయ్యి సీట్లున్న స్క్రీన్లు సోల్డ్ అవుట్ పెడుతున్నాయి.

ఈ క్రేజ్ ఏంటో అర్థం కావడం లేదని మల్లువుడ్ బయ్యర్లు ఆశ్చర్యపోతున్నారు. బన్నీకి కేరళలో వీర ఫ్యాన్స్ ఉన్న మాట నిజమే. తనకు ఒక్కడికే అది సాధ్యమయ్యింది. కానీ హ్యాపీని ఈ స్థాయిలో ఎగబడి చూస్తారని మాత్రం ఎవరూ ఊహించలేదు. అల్లు అర్జున్ ఎనర్జీ, యువన్ శంకర్ రాజా పాటలు, లీడ్ పెయిర్ మధ్య కామెడీ, మనోజ్ బాజ్ పాయ్ పాత్ర మొదలైనవి రిపీట్ ఆడియన్స్ వచ్చేలా చేస్తున్నాయి. హ్యాపీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

హ్యాపీ దెబ్బకు బన్నీ ఇతర సినిమాలకు అమాంతం డిమాండ్ పెరిగిపోయిందట. ఆర్యని ఒకేసారి అన్ని ప్రధాన భాషల్లో రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు, మలయాళం, హిందీ వెర్షన్లను భారీ ఎత్తున ప్రమోట్ చేస్తారని తెలిసింది. పుష్ప హీరో రెండో సినిమా అనే ట్యాగ్ దీనికి బాగా ఉపయోగపడుతుంది. వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్, దేవిశ్రీ ప్రసాద్ పాటలు, అమలాపురం ఐటెం సాంగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్యలో ఉన్న కమర్షియల్ స్టఫ్ మామూలుది కాదు.