లేటైతే… హైప్ హుళక్కే

ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు నుంచి ఆరు నెలల్లో పూర్తి చేసేవారు. ఇండస్ట్రీ హిట్లు అయిన ఎన్నో సినిమాల విషయంలో ఇదే జరిగింది. ‘పోకిరి’ వర్కింగ్ డేస్ 70 రోజుల్లోపే కావడం గమనార్హం. కానీ ఇప్పుడు చిన్న, మీడియం రేంజ్ సినిమాలను కూడా ఇన్ని వర్కింగ్ డేస్‌లో పూర్తి చేయట్లేదు.

సినిమా పూర్తి చేయడం ఒకెత్తయితే.. సరైన రిలీజ్ డేట్ చూసి విడుదల చేయడం ఇంకొక ఎత్తుగా మారిపోతోంది. రకరకాల కారణాలతో సినిమాలను వాయిదా వేస్తూ పోతున్నారు. వాయిదా కూడా ఒకసారికి పరిమితం కావడం లేదు. రెండు మూడుసార్లు.. అంతకంటే మించి కూడా డేట్లు మారుస్తున్న పరిస్థితులున్నాయి. సినిమాల మేకింగ్ మరీ ఇంత ఆలస్యం చేయడం, పదే పదే డేట్లు మార్చడం వల్ల జరిగే నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నారు.

నాని సినిమా ‘ది ప్యారడైజ్’ మీద ఒక దశ వరకు ఎంత హైప్ ఉండేదో తెలిసిందే. ‘ఆయా షేర్’ కొన్ని నెలల పాటు సోషల్ మీడియాను ఊపేసి సినిమా హైప్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది. కానీ ఈ చిత్రం మార్చి నుంచి ఆగస్టుకు వాయిదా పడి.. ఆ డేట్‌కు కూడా రాదనే సంకేతాలు వచ్చాక జనాలకు తీవ్ర అసహనం కలిగి ఈ సినిమా గురించి మాట్లాడ్డమే మానేశారు.

ఇక యశ్ మూవీ ‘టాక్సిక్’కు కూడా ఒక టైంలో మంచి హైప్ వచ్చింది. కానీ ఎంతకీ సినిమా విడుదల కాకపోవడం.. రిలీజ్ డేట్ గురించి అసలు ఊసే వినిపించకపోవడంతో సోషల్ మీడియా ఈ సినిమాను పక్కన పెట్టేసింది.

ఇక అక్కినేని అఖిల్ కెరీర్‌కు ఎంతో కీలకమైన ‘లెనిన్’ సినిమాకు మొదట్లో బజ్ లేకపోయినా.. పాటలు, ఇతర ప్రోమోలతో కొంత ఆసక్తి రేకెత్తించగలిగారు. కానీ ఈ సినిమాను కూడా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోవడంతో అక్కినేని అభిమానుల్లో నిట్టూర్పు మొదలైంది. నాగ్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించినా పెద్దగా స్పందన లేదు.

ప్రేక్షకులను మరీ గ్రాంటెడ్‌గా తీసుకుని మేకర్స్ ఇలా సినిమాల మేకింగ్‌ కోసం మరీ ఎక్కువ టైం తీసుకోవడం.. ఒక డేట్ ప్రకటించాక దానికి కట్టుబడకుండా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతుండడంతో ప్రేక్షకుల్లో అసహనాన్ని పెంచుతోంది. ఇంతింత టైం తీసుకుని ఏవో కళాఖండాలు తీస్తున్న బిల్డప్ ఇస్తారు కానీ.. చివరికి చూస్తే సినిమాల్లో అంత విషయమూ ఉండకపోవడంతో నెగెటివ్ టాక్‌కు దారి తీస్తోంది.