ఇటీవలే విడుదలైన సింగ్ గీతంకు ఊహించిన దానికన్నా పెద్ద స్పందన కనిపిస్తోంది. కంటెంట్ మాస్ ప్రేక్షకులకు పూర్తిగా కనెక్టయ్యేలా లేకపోయినా కథలో ఆత్మను దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు ఆవిష్కరించిన తీరు ఏ సెంటర్స్ ఆడియన్స్ ని కట్టిపడేస్తోంది. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో జనాలు అనుసంధానమవుతున్న వైనం బుకింగ్స్ లో కనిపిస్తోంది. నిన్న హైదరాబాద్ లాంటి నగరాల ప్రీమియం స్క్రీన్లు దాదాపుగా హౌస్ ఫుల్ కావడం కన్నా బలమైన సాక్ష్యం ఇంకేముంటుంది.
తొంభై నాలుగేళ్ళ వయసులో ఉన్న చోట నుంచే డైరెక్షన్ చేసిన ఆయన కళాతృష్ణకు ప్రేక్షకులు సెల్యూట్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ టీమ్ ఎంత సహకారం అందించినప్పటికీ సింగీతం గారు తాను నలభై సంవత్సరాల క్రితం రాసుకున్న కథని అంతే కన్విక్షన్ తో తెరకెక్కించిన తీరు ఫ్యామిలీ జనాలను బాగా ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం పెద్ద దన్నుగా నిలవగా మొదటి రోజు కన్నా రెండు మూడో రోజు కలెక్షన్లు ఎక్కువ ఉండటం గమనార్హం. బుక్ మై షో ట్రెండింగ్ కూడా నడిచింది.
కమర్షియల్ గా సింగ్ గీతం లెక్కలను నిర్మాత వేసుకోవడం లేదు. ఒక లెజెండరీ ఫిలిం మేకర్ తపనని తెరమీద చూపించామన్న సంతృప్తి వాళ్లలో కనిపిస్తోంది. అలాని నష్టాలు వచ్చే ఛాన్స్ లేదు. అధిక శాతం ఒన్ రిలీజ్ చేసుకోవడంతో లాస్ ప్రశ్న ఉత్పన్నం కాకపోవచ్చు. క్రమంగా పబ్లిక్ టాక్ పెరుగుతూ ఉండటంతో శుక్రవారం కొత్త రిలీజులు వచ్చేదాకా సింగ్ గీతంకు మంచి ఛాన్స్ ఉంది. సిటీస్ లో వసూళ్లు చూస్తే బ్రేక్ ఈవెన్ త్వరగా అవ్వొచ్చు.
ఇప్పుడీ స్పందనని చూసి సింగీతం శ్రీనివాసరావు గారు మరిన్ని సినిమాలు తీస్తారో లేదో చెప్పలేం కానీ ఎందరికో స్ఫూర్తి ఇచ్చారనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ముఖ్యంగా వయసు యాభై దాటగానే అవుట్ అఫ్ ట్రెండ్ లో ఉన్నామంటూ సాకులు చెప్పుకుని రిటైర్ మెంట్ తీసుకున్న ఎందరో డైరెక్టర్లకు ఆయనో గొప్ప పాఠం చెప్పారు. కుర్రాళ్లతో పని చేసి గొప్ప అవుట్ ఫుట్ ని ఇప్పటి జనరేషన్ కి కానుకగా ఇచ్చారు. నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో యూనిట్ సభ్యుల ఆనందం అంతా ఇంతా కాదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates