టాక్సిక్‌కు ఇంకో డేట్ దొర‌క‌లేదా?

ఈ ఏడాది మోస్ట్ అవైడెట్ సినిమాల్లో టాక్సిక్ ఒక‌టి. కేజీఎఫ్, కేజీఎఫ్‌-2 చిత్రాల‌తో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని స్టార్ ఇమేజ్ సంపాదించిన య‌శ్ నుంచి రానున్న త‌ర్వాతి చిత్ర‌మిది. లేడీ డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్ దాస్ రూపొందించిన ఈ సినిమా.. ప్రోమోల‌తో ప్రేక్ష‌కుల్లో అంచ‌నాల‌ను పెంచింది. పాన్ ఇండియా స్థాయిలో మ‌రో సెన్సేష‌న్ కాగ‌ల‌ద‌నే ఫీలింగ్ క‌లిగించాయి ప్రోమోలు.

ఈ చిత్రానికి ముందు అనుకున్న రిలీజ్ డేట్.. మార్చి 19. త‌ర్వాత జూన్ 4కు వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కానీ చివ‌రికి చూస్తే ఆ డేట్ కూడా ఖాయం కాలేదు. జూన్ 4 నుంచి సినిమాను వాయిదా వేస్తున్న విష‌యాన్ని ప్ర‌క‌టిస్తూ.. టీం చెప్పిన కార‌ణాలు చిత్రంగా అనిపించాయి అంద‌రికీ. కొత్త డేట్ ఇవ్వ‌కుండా వాయిదా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌డం ఈ సినిమాపై ఎన్నో ఆశ‌ల‌తో ఉన్న అభిమానుల‌కు తీవ్ర నిరాశ‌ను క‌లిగించింది. వాయిదా వేస్తే వేశారు, కొత్త డేట్ ఎప్పుడు చెబుతారా అని ఎదురు చూస్తున్నారంతా. కానీ టీం ఎంత‌కీ స‌స్పెన్సుకు తెర‌దించ‌డం లేదు.

ఐతే ఇప్పుడు ఉన్న‌ట్లుండి టాక్సిక్ రిలీజ్ డేట్ గురించి బాంబు లాంటి వార్త బ‌య‌టికి వ‌చ్చింది. ఈ చిత్రాన్ని నిర్మాత నారాయ‌ణ అస‌లు 2026లోనే రిలీజ్ చేయ‌ట్లేద‌ట‌. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి టాక్సిక్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ఆలోచ‌న చేస్తున్నార‌ట‌. 2026లో ఇంకా ఆరు నెల‌ల స‌మ‌యం ఉండ‌గా.. ఫ‌స్ట్ కాపీ దాదాపుగా రెడీ అయిన సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాల‌నుకోవ‌డం ఏంటో అర్థం కావ‌డం లేదు.

రాబోయే ఆరు నెల‌ల్లో మంచి డిమాండ్ ఉన్న వీకెండ్ల‌కు పాన్ ఇండియా స్థాయిలో క్రేజున్న సినిమాలు షెడ్యూల్ అయిన మాట వాస్త‌వ‌మే. కానీ టాక్సిక్ లాంటి డిమాండ్ ఉన్న సినిమాను ఏ సీజ‌న్లో, ఏ వీకెండ్లో రిలీజ్ చేసినా ఇబ్బంది ఉండ‌దు. మంచి వ‌సూళ్లే వ‌స్తాయి. మ‌రీ సంక్రాంతి వ‌ర‌కు సినిమాను ఆపితే నిర్మాత మీద ప‌డే వ‌డ్డీల భారంతో పోలిస్తే.. నార్మ‌ల్ వీకెండ్లో రిలీజ్ చేస్తే వ‌చ్చే న‌ష్టం త‌క్కువ‌.

పైగా సంక్రాంతి సీజ‌న్లో రిలీజ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో స‌రైన విడుద‌ల కూడా సాధ్యం కాదు. థియేట‌ర్లు దొర‌క‌వు. క‌ర్ణాట‌క, యుఎస్ స‌హా తెలుగు సినిమాల‌కు మంచి మార్కెట్ ఉన్న చోట‌ల్లా వ‌సూళ్ల మీద ప్ర‌భావం ప‌డుతుంది. కాబ‌ట్టి సంక్రాంతి రిలీజ్ అన్న‌ది టాక్సిక్‌కు ఏమాత్రం మంచిది కాద‌ని ఆలోచించి ఈ ఏడాదే వీలైనంత త్వ‌ర‌గా సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చేస్తే బెట‌ర్.