పెద్దిలో మిస్స‌యిన లాజిక్‌కు బుచ్చిబాబు జ‌వాబు

ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వ‌చ్చిన బిగ్గెస్ట్ మూవీ పెద్ది. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుద‌లైన ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల వ‌ర‌కు మంచి ఫ‌లితాన్నే రాబ‌ట్టింది. ఇత‌ర భాష‌ల్లో మాత్రం అనుకున్నంత‌గా ఆడ‌లేదు. హిందీ వ‌ర‌కు ప‌ర్వాలేదు. ఈ సినిమాకు యునాన‌మ‌స్ పాజిటివ్ టాక్ రాక‌పోయినా.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బాగానే ప్ర‌భావం చూపించింది. సినిమా మీద విమ‌ర్శ‌లు త‌క్కువేమీ కాదు.

జాన్వి క‌పూర్ పాత్ర విష‌యంలో విప‌రీత‌మైన నెగెటివిటీని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. దీంతో పాటు సినిమాలో కొన్ని స‌న్నివేశాలు, పాత్ర‌ల విష‌యంలో లాజిక్ మిస్స‌యింద‌నే కంప్లైంట్లు వినిపించాయి. ముఖ్యంగా బొమ‌న్ ఇరానీ చేసిన ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్ ఛైర్మ‌న్ పాత్ర చిత్ర‌ణ మీద చాలామంది అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. పారాలింపిక్స్‌లో స్వ‌ర్ణం గెలిచిన వ్య‌క్తి గురించి ఐఓసీ ఛైర్మ‌న్‌కు ఏమీ తెలియ‌కపోవ‌డం ఏంటి అనే ప్శ్న త‌లెత్తింది.

ఈ ప్ర‌శ్న‌కు పెద్ది స‌క్సెస్ ప్రెస్ మీట్లో ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌మాధానం చెప్పాడు. ఇది సూప‌ర్ ప్ర‌శ్న అంటూ.. ఇండియాలో క్రీడ‌లు, క్రీడాకారులకు సంబంధించి జ‌నాల అవ‌గాహ‌న ఎలాంటిదో రియాలిటీని వివ‌రించే ప్ర‌య‌త్నం చేశాడు బుచ్చిబాబు. ఇండియాలో హాకీ జాతీయ క్రీడ అని, మ‌రి ఆ క్రీడ‌లో ఇండియా కెప్టెన్ ఎవ‌రో ఎంత‌మందికి తెలుసు అని బుచ్చిబాబు ప్ర‌శ్నించాడు.

బొమ‌న్ ఇరానీ ఇందులో ఐదేళ్ల పాటు ఐఓసీ ఛైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించే పాత్ర చేశాడ‌ని.. ఆయ‌న ప‌ద‌విలోకి రావ‌డానికి పాతికేళ్ల ముందు ప‌త‌కం గెలిచిన వ్య‌క్తి గురించి ఆయ‌న‌కు తెలియాల్సిన అవ‌స‌రం లేద‌ని బుచ్చిబాబు వివ‌రించాడు.

ఇలా ప‌ద‌వుల్లో ఉండే వ్య‌క్తులకు త‌మ హ‌యాంలో ఉన్న క్రీడాకారుల గురించి తెలుస్తుంద‌ని.. ఎన్నో ఏళ్ల ముందు ఎవ‌రెవ‌రు ప‌త‌కాలు గెలిచారు, వారి వివ‌రాలేంటి అన్న‌ది వాళ్ల‌కు అవ‌గాహ‌న ఉండ‌క‌పోవ‌చ్చ‌ని చెప్పాడు బుచ్చిబాబు. ఈ విష‌యంలో తాను ఎంతో రీసెర్చ్ చేశాకే ఆ పాత్ర‌ను అలా డిజైన్ చేసిన‌ట్లు బుచ్చిబాబు వివ‌రించాడు. ద‌ర్శ‌కుడు ఇలా లాజిక‌ల్‌గా జవాబివ్వ‌డంతో బొమ‌న్ ఇరానీ పాత్ర విష‌యంలో చాలామంది ఉన్న సందేహాలకు తెర‌ప‌డిన‌ట్లే.