లెనిన్ మీద మెగాభిమానుల గుస్సా

అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే లెనిన్ కు ముందు అనుకున్న విడుదల తేదీ మే 1. కానీ పెద్ది ఏప్రిల్ 30 వస్తుందని పుకారు బయటికి రావడం, అది పెద్ద ఎత్తున వైరల్ కావడం తెలిసిందే. దీంతో పెద్ది కోసం లెనిన్ త్యాగం చేస్తుందని, రామ్ చరణ్, అఖిల్ మధ్య ఉన్న స్నేహం దృష్ట్యా మేం జూన్ 26 వెళ్తున్నామని అన్నపూర్ణ స్టూడియోస్, సితార సంస్థలు సంయక్తంగా ప్రకటించారు.

ఆ టైంలో పెద్ది మీద కామెంట్స్ కూడా వచ్చాయి. పదే పదే డేట్లు మార్చడం వల్ల ఇతర సినిమాలకు ఇబ్బంది అవుతోందని, సరైన ప్లానింగ్ లేకుండా ఇలా చేయడం ఏమిటంటూ కొందరు అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. తీరా చూస్తే అటు పెద్ది ఇటు లెనిన్ రెండూ మాట మీద నిలబడలేదు. ఇప్పుడు నాగార్జున కొత్త డేట్ అనౌన్స్ చేశారు. జూలై 10 లెనిన్ వస్తుందంటూ సరికొత్త అఖిల్ ని చూస్తారంటూ గతంలోనే చెప్పిందే కొంచెం పదాలు మార్చి రిపీట్ చేశారు.

ఇక్కడే మెగా ఫ్యాన్స్ కి లాజిక్ దొరికింది. గతంలో పెద్ది కోసమే రెండు నెలలు వాయిదా వేసుకున్న లెనిన్ మరిప్పుడు చెప్పిన సమయానికి ఎందుకు రావడం లేదని నిలదీస్తున్నారు. అంటే రెండు నెలల క్రితం ఫస్ట్ కాపీ సిద్ధం కాకుండానే అకారణంగా పెద్దిని సాకుగా చూపించారని చెబుతూ మెగా ఫ్యాన్స్ స్వంతంగా ఒక మీమ్ ప్రెస్ నోట్ తయారు చేసి ఎక్స్, ఇన్స్ టాలో తిప్పుతున్నారు. మళ్ళీ పెద్ది థియేటర్ రన్ కోసమే లెనిన్ ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు వ్యంగ్యంగా రాశారు.

ఈ ట్రోలింగ్ గోల ఎలా ఉన్నా అగ్ర నిర్మాతలు మాట మీద ఉండటం మహా కష్టమైపోతోంది. సరే దేవర, పెద్ది లాంటివి భారీ ప్యాన్ ఇండియా మూవీస్ అంటే ఏదో అనుకోవచ్చు. వాటి స్థాయిలో ఖర్చు పెట్టని లెనిన్ ఇంత ఆలస్యం కావడం ఆశ్చర్యమే. అఖిల్ కెరీర్ కి ఇది చాలా కీలకం కానుంది. మినిమమ్ సూపర్ హిట్ కొట్టాల్సిందే. బ్లాక్ బస్టర్ అయితే బోనస్. నాగ్, నాగ వంశీ ఇద్దరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇంకో నెల రోజులు వెయిట్ చేయాల్సిందే.