శర్వానంద్ ‘భోగి’కి భలే కలిసి వచ్చింది

కొన్నిసార్లు అంతే అనుకోకుండా అదృష్టం తలుపు తట్టేస్తుంది. దాన్ని వాడుకోవడం తెలిసుండాలి అంతే. ప్రస్తుతం శర్వానంద్ తో భోగి తీస్తున్న దర్శకుడు సంపత్ నంది బృందం అదే పనిలో ఉంది. దీనికి ఫిక్స్ చేసిన థియేట్రికల్ రిలీజ్ డేట్ ఆగస్ట్ 28. నెలల క్రితమే దీన్ని ప్రకటించారు. దానికి అనుగుణంగా షూటింగ్ చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం కీలకమైన క్లైమాక్స్ ఘట్టాన్ని ఇరవై రోజుల పాటు నాన్ స్టాప్ గా తీస్తున్నారు. చాలా హై వోల్టేజ్ యాక్షన్ ఇందులో ఉంటుందట.

ఇక్కడ లక్కు గురించి ప్రస్తావించడానికి కారణం ఉంది. ఆగస్ట్ 21 రావాల్సిన ది ప్యారడైజ్ మళ్ళీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇది భోగి టీమ్ కు ముందే తెలియదు. వారం గ్యాప్ ఉంటుంది చాలనుకుని పోటీకి సిద్ధ పడ్డారు. ఇప్పుడు నాని మూవీ స్థానంలో రవితేజ ఇరుముడి వస్తోంది. ప్యారడైజ్ తో పోల్చుకుంటే భోగి దీంతో కాంపిటీషన్ పడటం సులభమవుతుంది. ఎందుకంటే జానర్, బడ్జెట్లు రెండు వేర్వేరు కాబట్టి. ఆ రకంగా బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు.

ఇక్కడితో అయిపోలేదు. ఆగస్ట్ లో అనుకున్న జైలర్ 2 వినాయక చవితి వైపు చూస్తోంది. విశ్వంభర వచ్చే ఛాన్స్ లేనట్టే. స్వయంభు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సంబరాల ఏటిగట్టు ఇప్పుడప్పుడే కాదు. విశ్వనాథ్ అండ్ సన్స్ ఆగస్ట్ 14 ఉంది కానీ దాని స్టోరీ బ్యాక్ డ్రాప్ పరంగా చూసుకుంటే అది మాస్ జనాలను టార్గెట్ చేసింది కాదు. సో టెన్షన్ అక్కర్లేదు. ఎలా చూసుకున్నా ఫుల్ కమర్షియల్ కంటెంట్ తో రూపొందుతున్న భోగికి ఆగస్ట్ నెల బాగా ప్లస్ అయ్యేలా ఉంది.

ఎటొచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు. మిగిలింది బాక్సాఫీస్ చూసుకుంటుంది. శర్వానంద్ కి నారి నారి నడుమ మురారి రూపంలో సంక్రాంతికి హిట్టు దక్కింది. చాలా కష్టపడి చేసిన బైకర్ ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా మంచి సినిమా అనే ముద్ర తన ఫిల్మోగ్రఫీలో చేరిపోయింది. ఇప్పుడు భోగి కనక వర్కౌట్ అయితే మాస్ లో పట్టు పెంచుకునేందుకు అవకాశం దొరుకుతుంది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా 1960 బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది.