పెద్దికి రేట్లు లేకపోతేనే మంచిదా?

సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్‌లో మళ్లీ కళ తెచ్చే సినిమా అవుతుందని అందరూ ‘పెద్ది’ మీదే ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంపై అంచనాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. చాలా కాలంగా సరైన సినిమా లేక ఆవురావురుమని ఉన్న ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సరైన ఫీడ్ లేక ఇబ్బంది పడుతున్న థియేటర్లు కూడా ఈ చిత్రం మీదే ఆశలు పెట్టుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమాకు ముందు రోజే పెయిడ్ ప్రిమియర్స్ వేసుకోవడానికి అనుమతి లభించింది. ఆ షోలకు రూ.600 టికెట్ రేటు పెట్టారు. రిలీజ్ రోజు నుంచి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.125 రేటు పెంచుకునే సౌలభ్యం కూడా కల్పించింది ప్రభుత్వం. దీని వల్ల బయ్యర్లు, ఎగ్జిబిటర్లకు బాగానే ప్రయోజనం దక్కబోతోంది.

కానీ ఈ అవకాశం తమకు దక్కేలా లేదని తెలంగాణ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ఒకింత ఆందోళనలో ఉన్నారు. ఈ సినిమాకు హైక్స్ వస్తే.. ఎగ్జిబిటర్లకు కూడా అందులోంచి పర్సంటేజీ ఇచ్చేలా ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.
కానీ తెలంగాణలో కోర్టు చిక్కుల కారణంగా ‘పెద్ది’కి అదనపు రేట్లు, ప్రిమియర్ షోలకు అవకాశం దక్కడం సందేహంగానే ఉంది. కానీ ఈ విషయంలో మరీ కంగారుపడాల్సిన అవసరం కూడా లేదు.

రేట్ల పెంపు విషయంలో ప్రేక్షకుల్లో లోలోన ఎంత వ్యతిరేకత ఉందో తెలియంది కాదు. ఈ రోజుల్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమాలు తగ్గిపోయాయి. అలా ఆకర్షించే సినిమాకేమో రేట్లు పెంచేస్తున్నారు. దీంతో జనం థియేటర్లకు రావడం మరింత తగ్గుతోంది. పెద్ద సినిమాలకు నార్మల్ రేట్లు పెడితే.. ఎక్కువమంది థియేటర్లకు రావడం ఖాయం.

అదనపు రేట్ల ద్వారా వచ్చే ఆదాయం.. ఫుట్ ఫాల్స్ పెంచుకోవడం ద్వారా కూడా రాబట్టవచ్చు. నిజానికి ఆ మార్గంలో ఇంకా ఎక్కువ ఆదాయం అందుకునే అవకాశం కూడా ఉంటుంది. ‘దురంధర్’, ‘దురంధర్-2’ చిత్రాలకు నార్మల్ రేట్లు పెడితే జనం విరగబడి చూశారు.

‘పెద్ది’కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకు రేట్ల పెంపు లేకపోతే.. టాక్‌తో సంబంధం లేకుండా జనం పెద్ద ఎత్తున ఈ సినిమాను చూసే అవకాశం ఉంటుంది. రేట్లు పెంచితే మాత్రం ప్రేక్షకుల్లో ఒక వర్గం వెనుకంజ వేస్తుంది. టాక్ చాలా బాగుంటే చూద్దాంలే అని ఆగుతారు. కాబట్టి ఒక రకంగా రేట్లు పెంచకపోవడం కూడా మంచిదే.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను నార్మల్ రేట్లతోనే రిలీజ్ చేశారు కానీ.. సినిమాకు టాక్ బాగా లేకపోవడంతో దాని వల్ల ప్రయోజనం లేకపోయింది. కానీ ‘పెద్ది’ మీద ఆశలు, అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ఈ సినిమా బాగుండి, మంచి టాక్ వస్తే మాత్రం తెలంగాణలో ఫుట్ ఫాల్స్ కచ్చితంగా ఎక్కువగా ఉంటాయి. అదనపు రేట్లతో వచ్చే ఆదాయాన్ని మించి డబ్బులు వచ్చే అవకాశముంటుంది.