కేవలం నాలుగు నెలల గ్యాప్ లో రెండు ఇండస్ట్రీ హిట్లు దురంధర్, దురంధర్ ది రివెంజ్ సాధించిన ఒకే ఒక్క హీరోగా రణ్వీర్ సింగ్ అందుకున్న ఘనత చిన్నది కాదు. మహామహులకే సాధ్యం కాని ఫీట్ ఇది. అయితే ఇతని మీద మూడేళ్ళ పాటు నిషేధం విధిస్తూ ఎఫ్డబ్ల్యుఐసిఈ (FWICE) నిర్ణయం తీసుకోవడం సంచలనం రేపుతోంది. దీని ప్రకారం ఏ దర్శకుడు, నిర్మాత తనతో పని చేయడానికి వీలుండదు. పెదరాయుడులో రజనీకాంత్ ఇచ్చిన తీర్పు లాంటిది ఇది.
విషయంలోకి వెళ్తే దర్శక నిర్మాత ఫర్హాన్ అక్తర్ తలపెట్టిన డాన్ 3 నుంచి రణ్వీర్ సింగ్ అర్ధాంతరంగా తప్పుకోవడంతో నిర్మాణ సంస్థకు 45 కోట్ల దాకా నష్టం వాటిల్లిందని, ప్రీ ప్రొడక్షన్ కోసం ఖర్చు పెట్టిన వ్యయం, నటీనటులు, టెక్నీషియన్లు తదితరుల డేట్లు తీసుకుని వాటికి అడ్వాన్సులు ఇవ్వడం ద్వారా ఎన్నో వ్యయ ప్రయాసలు చవి చూడాల్సి వచ్చిందని, ఇంత నష్టానికి కారణమైనందు వల్లే రణ్వీర్ మీద బ్యాన్ విధిస్తున్నట్టు సదరు సంఘం ప్రతినిధులు ప్రకటించారు.
గతంలో ఇలా హఠాత్తుగా హీరోలు తప్పుకున్న ఉదంతాలు చాలా ఉన్నాయి. హేరా ఫేరీ 3 విషయంలో ఇలాంటి రగడ తలెత్తితే ముందు పరేష్ రావల్, ఆ తర్వాత అక్షయ్ కుమార్ ఇద్దరూ అగ్రిమెంట్ ప్రకారం నష్టపరిహారం రూపంలో డబ్బులు వెనక్కు ఇచ్చినట్టుగా వార్తలు ఉన్నాయి. అయితే రణ్వీర్ సింగ్ తో ఒకవేళ అలాంటి ఒప్పందం ఏదైనా ఉంటే సొమ్ము రిటర్న్ చేయాలి లేదా కోర్టులో కేసు వేయాలి. అంతే తప్ప బ్యాన్ చేయడం ఏమిటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఇంత స్టార్ డం వచ్చింది కాబట్టి ఓర్వలేని వాళ్ళు ఎవరో కుట్ర చేస్తున్నారనే కోణంలో ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి రణ్వీర్ సింగ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. లీగల్ టీమ్ తో చర్చించి ఆ తర్వాత కార్యాచరణ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. త్వరలో ఒక జాంబీ ఫాంటసీ మూవీకి రెడీ అవుతున్న టైంలో ఇలాంటి బ్యాన్ రణ్వీర్ కి ఇబ్బంది కలిగించేదే. తను దీన్ని ఎలా ఎదురుకుంటాడో చూడాలి. మూడు సంవత్సరాలంటే చిన్న సమయం కాదుగా.
Gulte Telugu Telugu Political and Movie News Updates