ఒకప్పటితో పోలిస్తే సినిమాల సక్సెస్ రేట్ ఎంత దారుణంగా పడిపోయిందో, సినీ నిర్మాణం ఎంత జూదంలా మారిపోయిందో.. నిర్మాతల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో తెలిసిందే. నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టే సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రొడక్షన్ కాస్ట్ ఏమో బాగా పెరిగిపోయింది. బడ్జెట్ రికవరీ అన్నది చాలా కష్టంగా మారింది.
అందుకే తాను ప్రొడక్షన్‌కు దూరంగా ఉన్నట్లు చెబుతున్నాడు బండ్ల గణేష్. ఒక దశలో వరుసగా పెద్ద పెద్ద సినిమాలు నిర్మించిన గణేష్.. ఉన్నట్లుండి ప్రొడక్షన్ వదిలేశాడు. టెంపర్ లాంటి హిట్ ఇచ్చి సినీ నిర్మాణానికి దూరం అయ్యాడు. మళ్లీ పవన్ కళ్యాణ్‌తో ఒక సినిమా చేసి, బేనర్ మూసేయాలని బండ్ల కోరుకుంటున్నాడు కానీ.. ఇప్పుడున్న బిజీలో పవర్ స్టార్ ఎప్పుడు అవకాశమిస్తాడో తెలియదు. ఆ సంగతి పక్కన పెడితే.. తాను నిర్మించిన ఏ సినిమాకూ తాను ఒక్క రూపాయి కూడా నష్టపోలేదని బండ్ల గణేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.
నిర్మాతగా గణేష్ తొలి సినిమా ఆంజనేయులు ఫ్లాప్ అయింది. రెండో చిత్రం తీన్ మార్ సైతం ఫ్లాపే. కానీ కంటెంట్, కలెక్షన్ల పరంగా ఇవి ఫ్లాపులే కానీ.. తాను మాత్రం నిర్మాతగా నష్టపోలేదని బండ్ల తెలిపాడు. ముఖ్యంగా తీన్ మార్ గురించి అడిగితే.. ఆ సినిమాకు కూడా తాను లాభం అందుకున్నట్లు వెల్లడించాడు.
డబ్బులు పోగొట్టుకుని సినిమాలు నిర్మించడానికి తానేమైనా పిచ్చివాడినా అని బండ్ల ప్రశ్నించాడు. వ్యాపారం చేసి ఎవరైనా డబ్బులు పోగొట్టుకుంటాడా అని బండ్ల అన్నాడు. మరి ఇప్పుడున్న నిర్మాతల పరిస్థితి ఏంటి అని అడిగితే.. వాళ్లు తన కంటే తెలివైన వాళ్లని.. లాభాలు వస్తున్నాయి కాబట్టే సినిమాలు తీస్తున్నారేమో అని బండ్ల అన్నాడు.
ఇలా వ్యంగ్యంంగా మాట్లాడుతూనే.. ప్రస్తుతం సినిమాల నిర్మాణం ఎంత దారుణంగా మారిందో బండ్ల వెల్లడించాడు. ప్రొడక్షన్ పూర్తిగా చెయ్యి దాటిపోయిందని, ఇప్పుడు ఎవరికీ సలహాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని బండ్ల చెప్పాడు. సినీ నిర్మాణం 4వ దశ క్యాన్సర్ స్థాయిలో ఉందని అతనన్నాడు.. ఒక సన్నివేశంలో లక్ష రూపాయల పెన్ను వాడదాం, రిచ్‌గా ఉంటుందని అంటారని.
కానీ ఆ పెన్ను వల్ల సినిమాలు ఆడేస్తాయా అని బండ్ల ప్రశ్నించాడు. ఒకప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర మేకులు కూడా తూకం వేసుకునేవాళ్లమని. నిర్మాతకు ప్రతి రూపాయి లెక్క ఉండేదని.. ఇప్పుడు ప్రొడక్షన్ పూర్తిగా అదుపు తప్పిందని, ఇలాంటి సమయంలో సినిమాలు తీయడం చాలా కష్టమని బండ్ల అభిప్రాయపడ్డాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates