పుష్ప ప్రభావం ఎప్పటికీ పోదేమో

సంవత్సరాలు గడుతున్నా పుష్ప ప్రభావం అన్ని బాషా పరిశ్రమల మీద ఇంకా బలపడుతోంది తప్ప తగ్గడం లేదు. అడవుల నేపథ్యంలో స్మగ్లింగ్ కథాంశంగా తీసుకుని కథలు అల్లుతున్న దర్శకులు పెరిగిపోతున్నారు. గత ఏడాది మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ‘విలయత్ బుద్ధా’ అనే సినిమా వచ్చింది. దాంట్లో పుష్ప పోలికలు చాలా కనిపించాయి. స్టోరీలు వేరైనప్పటికీ కంపారిజాన్లు గట్టిగా వినిపించాయి. ఇప్పుడు మరో మూవీ కాటలాన్ రాబోతోంది.

ఇది కూడా పుష్ప లాగే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. కాకపోతే ఎర్రచందనం స్థానంలో ఏనుగు దంతాలు పెట్టారు. ఆంటోనీ వర్గీస్ హీరోగా నటించగా మన సునీల్ తో పాటు కబీర్ దుల్హన్ సింగ్ విలన్లుగా నటించారు. కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. మొత్తం యాక్షన్ విజువల్స్ తో నింపేశారు. గన్నులతో కాల్చుకోవడం, అడవిని దోచుకోవడం, కుట్రలు కుతంత్రాలు, మొత్తం ఇదే ఉంది.

విడుదల తేదీ మే 28 ఆల్రెడీ ప్రకటించారు. అయితే దృశ్యం 3 బలంగా రన్ అవుతున్న నేపథ్యంలో ఏమైనా మార్పు ఉంటుందేమోనని బయ్యర్ వర్గాలు అనుమానించాయి కానీ పోస్ట్ పోన్ గురించి ఇప్పటికైతే ఎలాంటి సమాచారం లేదు కాబట్టి ప్రస్తుతానికి డేట్ అదే. అయితే తెలుగులో టైటిల్ మార్చకుండా ఒరిజినల్ దే పెట్టడం మాత్రం బాలేదు. టైటిల్ కింద క్యాప్షన్ గా వేటగాడు అని జోడించినప్పటికీ హైలైట్ అయ్యేది మాత్రం కాటలాన్ అనే పేరే.

ఈ సినిమాలో చాలా పెద్ద క్యాస్టింగే ఉంది. సునీల్ ఒకటే కాదు పుష్పలో నటించిన పలువురు చిన్న ఆర్టిస్టులు ఇందులో భాగం పంచుకోవడం విశేషం. పబ్లిసిటీ బాగానే చేస్తున్నారు కానీ ఇక్కడ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. అసలే జూన్ 4 పెద్ది ఉంది. సరిగ్గా దానికి వారం ముందు రావడం రిస్క్ అయితే అవుతుంది. కేరళలో ఇబ్బంది ఉండదు కానీ మిగిలిన రాష్ట్రాల్లో కాటాలన్ కు కాంపిటీషన్ అయితే తప్పదు. పాల్ జార్జ్ దీనికి దర్శకుడు.