ఇంతకీ తారక్ నుంచి ఆ అప్‌డేట్ ఎక్కడ?

ఈ రోజు నందమూరి అభిమానులకు పండుగ రోజు. ఈ లెజెండరీ సినీ ఫ్యామిలీలో మూడో తరం సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం ఈ రోజు. ఈసారి తారక్ పుట్టిన రోజును మరింత స్పెషల్‌గా మారుస్తూ.. అర్ధరాత్రి 12 గంటలకు రిలీజ్ చేసిన ప్రశాంత్ నీల్ సినిమా ‘డ్రాగన్’ గ్లింప్స్ అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది. కథా నేపథ్యాన్ని చూపించిన తీరు.. తారక్ క్యారెక్టర్ని పరిచయం చేసిన వైనం.. తనకు ఇచ్చిన ఎలివేషన్, డైలాగ్స్ వేరే లెవెల్ అని అభిమానులు మురిసిపోతున్నారు.

ఐతే ఈ అప్‌డేట్ గురించి చాలా రోజుల ముందే అధికారికంగా న్యూస్ బయటికి వచ్చింది. అభిమానుల అంచనాలను అందుకుంటూ గ్లింప్స్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఐతే దీంతో పాటు తారక్ పుట్టిన రోజుకు ఇంకో పెద్ద అప్‌డేట్ ఆశించారు ఫ్యాన్స్. అది.. ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకు సంబంధించింది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యస్వామి కథ ఆధారంగా తెరకెక్కే ఈ మెగా మైథలాజికల్ మూవీలో తారక్ నటిస్తాడని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది.

దాదాపు మూడేళ్లుగా ఈ ప్రాజెక్టు ప్రచారంలో ఉంది. ముందు అల్లు అర్జున్ ఈ సినిమా చేస్తాడన్నారు. తర్వాత తారక్ పేరు తెరపైకి వచ్చింది. ఐతే ఈ మెగా మూవీ గురించి అధికారిక అప్ ‌డేట్ కోసమే ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. కానీ సందిగ్ధతకు ఇప్పుడైనా తెరపడుతుందని ఆశించారు.

ఉదయం నుంచి సితార ఎంటర్టైన్మెంట్స్, నాగవంశీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి అప్‌డేట్ కోసం చూస్తున్నారు. కానీ సితార సంస్థ.. రెగ్యులర్ విషెస్ పోస్టర్‌తో సరిపెట్టింది. నాగవంశీ ఏమో ‘డ్రాగన్’ గ్లింప్స్ మీద ప్రశంసలు కురిపించడంతో ఊరుకున్నాడు.

‘గాడ్ ఆఫ్ వార్’ గురించి మాత్రం ఏ అప్‌డేట్ ఇవ్వలేదు. ఫ్యాన్స్ ఏమో.. ఆ సినిమాను ప్రకటించడానికి ఇంతకంటే మంచి సందర్భమేముంటుందంటూ పోస్టులు పెడుతున్నారు. ఐతే ‘డ్రాగన్’ గ్లింప్స్ సోషల్ మీడియాను ముంచెత్తిన నేపథ్యంలో ఈ పుట్టిన రోజును ఆ సినిమాకే వదిలిపెట్టేసి, ‘గాడ్ ఆఫ్ వార్’ అప్‌డేట్ ఇంకో సందర్భంలో ఇద్దామని ఊరుకున్నారా.. లేక ఈ ప్రాజెక్టు విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదా అన్నది అర్థం కాక ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు.