టాక్సిక్ నిర్మాతకు ‘డెవిల్’ షాక్ కొట్టింది

కెవిఎన్ ప్రొడక్షన్స్ అంటే నిన్న ఏడాది దాకా పెద్దగా పరిచయం లేదు కానీ గత ఆరు నెలల్లో ఒక్కసారిగా ఈ ప్రొడక్షన్ హౌస్ పేరు మారుమ్రోగడం మొదలయ్యింది. ముఖ్యంగా జన నాయకుడు వాయిదా పడటం, నాలుగు నెలలు గ్యాప్ రావడం, విజయ్ ఏకంగా సిఎం అయిపోవడం, దానికి సంబంధించిన రాజకీయ కార్యక్రమాల్లో నిర్మాత కనిపించడం ఇవన్నీ ఫ్యాన్స్ మధ్య టాపిక్ గా మారాయి. ఇదే బ్యానర్ యష్ తో టాక్సిక్ తీసి విడుదల తేదీని వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ఈ వారం ప్రారంభం కాబోతున్న మెగాస్టార్ 158 నిర్మాణ సంస్థ కూడా కెవిఎనే. అంతా బాగానే ఉంది కానీ ఈ బ్యానర్ నుంచి రెండు వారాల క్రితం కెడి ది డెవిల్ విడుదలయ్యింది. ముందు కన్నడలో రిలీజ్ చేశారు. ధృవ సర్జ హీరోగా నటించిన ఈ భారీ యాక్షన్ డ్రామాలో సంజయ్ దత్, శిల్పా శెట్టితో పాటు కిచ్చ సుదీప్ ఒక ప్రత్యేక క్యామియో చేశారు. బడ్జెట్ విపరీతంగా ఖర్చు పెట్టారు. ఇటీవలే తెలుగు డబ్బింగ్ విడుదల చేశారు. మన ప్రేక్షకులు పిచ్చ లైట్ తీసుకున్నారు.

రెండు భాషల్లోనూ కెడి ది డెవిల్ బ్రేక్ ఈవెన్ చేరుకోలేకపోయిందని ట్రేడ్ టాక్. నిజానికి కెజిఎఫ్ రేంజ్ లో ఒక ల్యాండ్ మార్క్ మూవీ అవ్వాలనే సంకల్పంతోనే దీన్ని మొదలుపెట్టారు. అయితే యాక్షన్ ఎలివేషన్ల డోస్ ఎక్కువైపోయి కథా కథనాలు మరీ రొటీన్ అనిపించడంతో జనం ఒప్పుకోలేదు. కన్నడలో ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చాయంటే ప్రాజెక్టు మీద ఉన్న క్రేజే కారణం. కానీ కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండటంతో ఎక్కువ లాగలేకపోయింది.

ఇది ఫ్లాప్ కావడం ఒకరకంగా టాక్సిక్ నిర్మాతకు షాకని చెప్పాలి. అయితే పడిన చోటే లేచే అవకాశాన్ని ఇండస్ట్రీ ఇస్తుంది. ప్రస్తుతం జన నాయకుడికి డిమాండ్ పెరిగింది. విజయ్ సిఎం అయిపోవడంతో బయ్యర్లు భారీ రేట్లు ఆఫర్ చేస్తున్నారట. తెలుగులోనూ డిమాండ్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓపెనింగ్స్, కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులు నమోదు కావడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే కనక కెవిఎన్ మరింత మెరుగ్గా రికవర్ అయిపోయి దూసుకెళ్లడం ఖాయం.