జూనియర్ రమేష్ బాబు సౌండ్ పెంచాలి

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు వచ్చేసింది. ప్రమోషన్లు కూడా ఊపందుకున్నాయి. ఇప్పటిదాకా ఒక టీజర్, లిరికల్ సాంగ్ వచ్చాయి. బాగానే ఉన్నాయి కూడా. అయినా కూడా గ్రౌండ్ లెవెల్ లో తగినంత బజ్ లేదు. సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నప్పటికీ అవి కింది స్థాయి కృష్ణ అభిమానులకు రీచ్ కావడం లేదు. వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

ఈ సినిమాలో ప్రత్యేకతలు ఉన్నాయి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రీ ఎంట్రీ ఇస్తున్న సినిమాల్లో ప్యారడైజ్ కన్నా ముందు ఇదే వస్తుంది. ఫ్యాక్షనిస్టుగా చాలా పవర్ ఫుల్ రోల్ డిజైన్ చేశారని తెలిసింది. నిన్నటి జనరేషన్ హీరోయిన్ రవీనాటాండన్ కూతురు రషా తదాని దీంతోనే టాలీవుడ్ తెరంగేట్రం చేస్తోంది. మంగళవారం తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్న దర్శకుడు అజయ్ భూపతికి ఇది చాలా పెద్ద బాధ్యత. ఇద్దరు స్టార్ కిడ్స్ ని బాగా ప్రెజెంట్ చేయాలి.

వారణాసి షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల మహేష్ బాబు అవసరమైన మోతాదలో అన్న కొడుకు సినిమాని సూపర్ వైజ్ చేయలేకపోతున్నాడని ఇన్ సైడ్ టాక్. ఫైనల్ కాపీ అయ్యాక తనకోసారి చూపించే ప్లాన్ లో ఉంది టీమ్. ఆయన చూసి సంతృప్తి వ్యక్తం చేస్తే బోలెడు ధైర్యం వస్తుంది. బాలీవుడ్ హిట్ మూవీ ఇషక్ జాదే ఛాయలు కనిపిస్తున్నప్పటికీ శ్రీనివాస మంగాపురం పూర్తిగా కొత్త కథ అంటున్నారు యూనిట్ సభ్యులు. కృష్ణ పుట్టినరోజుకి ట్రైలర్ రావొచ్చు.

నిజానికి మే నెలలోనే సినిమా రిలీజ్ చేయాల్సింది. కానీ పెద్ది పోస్ట్ పోన్, లెనిన్ ముందుకు వెనక్కు జరగడం, స్వయంభు డేట్ తేలకపోవడం లాంటి పరిణామాలు శ్రీనివాస మంగాపురంని నిర్ణయం తీసుకోనివ్వకుండా చేశాయి. విడుదల తేదీ ఖరారు చేశాక మహేష్ బాబుతో పాటు ఘట్టమనేని ఫ్యామిలీని అంతా గెస్టులుగా తీసుకొచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. జూన్ చివర్లో లేదా జూలైలో సినిమాని థియేటర్లలో తీసుకొచ్చే ప్రతిపాదనైతే బలంగా ఉందట.