కాంచన 4 కోసం లారెన్స్ కష్టనష్టాలు

ఉత్తరాది హారర్ కామెడీ అనే జానర్ కు కమర్షియల్ రేంజ్ తీసుకొచ్చిన ఘనత లారెన్స్ రాఘవేంద్రకే దక్కుతుంది. ముని సినిమా ఎందరికి స్ఫూర్తినిచ్చిందో లెక్క చెప్పడం కష్టం. ఆ తర్వాత కాంచన, గంగ కూడా అంతే విజయాన్ని అందుకుని కనక వర్షం కురిపించాయి. ముఖ్యంగా కాంచన 3 ఎంత రొటీన్ గా ఉన్నా వసూళ్లు వంద కోట్లు దాటేసి ఔరా అనిపించుకుంది. ఇప్పుడు కాంచన 4 నిర్మాణంలో ఉంది. చెన్నై వర్గాల్లో దీనికి సంబంధించి ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి.

కాంచన 4 చాలా పెద్ద బడ్జెట్ తో రూపొందుతోంది. కొన్ని ఎపిసోడ్స్ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో లారెన్స్ రీ షూట్ చేస్తున్నట్టు కోలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. పర్ఫెక్షన్ విషయంలో రాజీ ప్రస్తావనే తేకుండా పదే పదే బెస్ట్ కోసం తపిస్తున్నాడని అంటున్నారు. పూజా హెగ్డే లాంటి గ్లామర్ హీరోయిన్ ని దెయ్యం క్యారెక్టర్ కు ఎంచుకున్న లారెన్స్ అక్కడే పెద్ద రిస్క్ చేశాడు. కాకపోతే ఈ పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ ఇప్పటిదాకా స్క్రీన్ మీద రాని స్థాయిలో ఉంటుందట.

నోరా ఫతేహి మరో ప్రధాన పాత్ర పోషిస్తున్న కాంచన 4 విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. వరస నెలల్లో చాలా ప్యాన్ ఇండియా సినిమాలు ఉండటంతో సోలో రిలీజ్ కోసం ట్రై చేస్తున్నాడు. చంద్రముఖి 2 దర్శకుడు తాను కాకపోయినా బాక్సాఫీస్ ఫలితంలో డిజాస్టర్ చూసిన లారెన్స్ మళ్ళీ కంబ్యాక్ అయ్యేందుకు కాంచన 4ని ఎందుకున్నాడు. ఇప్పటికే ఏడాదిన్నరగా షూటింగ్ లో ఉన్న కాంచన 4కి మరో నాలుగైదు నెలలు అవసరం పడొచ్చు.

ట్రేడ్ అంచనా ప్రకారం కాంచన 4 లారెన్స్ ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా కనిష్టంగా నూటా యాభై కోట్ల థియేటర్ బిజినెస్ చేస్తుందట. ఎందుకంటే ఆ రేంజ్ కంటెంట్ తో పాటు ట్రైలర్ వచ్చాక అంచనాలు మొత్తం మారిపోయే స్థాయిలో లారెన్స్ చాలా శ్రద్ధ తీసుకున్నాడట. ముని సిరీస్ లో నటించిన అధిక శాతం నటీనటులు ఇందులో భాగం కాబోతున్నారు. అన్నట్టు కాంచన 4తో ఈ సిరీస్ కు లారెన్స్ శుభం కార్డు పలకబోతున్నాడు. ఇకపై కొనసాగించే ఉద్దేశం లేదట.