IBOMMA 2.0: అరెస్ట్ అయినా ఆగలేదేంటి?

చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు ప్రకటించి ఏడాది కూడా కాలేదు. ఇండస్ట్రీ హమ్మయ్య అనుకునే లోపే మళ్లీ అదే పేరు, అదే భయం తెరపైకి వచ్చేసింది. ఈసారి ‘Movies New Bappam TV’ అనే ముసుగుతో వచ్చేసింది. పైకి రివ్యూలు, బాక్సాఫీస్ అప్‌డేట్స్ అని చెబుతున్నా, టెలిగ్రామ్ గ్రూపుల్లో మాత్రం “HD ప్రింట్ రెడీ” అనే మెసేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి.

ఇక్కడ అసలు కథ రవి ఒక్కడిది కాదు. ఐబొమ్మ అనేది ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థగా ఉన్నట్లు అర్ధమవుతుంది. సర్వర్లు విదేశాల్లో, డొమైన్లు రోజుకోటి, టెలిగ్రామ్‌లో వేల మంది అడ్మిన్లు. ఒక్కడిని పట్టుకుంటే ఆపరేషన్ ఆగదని తెలుస్తోంది. అందుకే రవి బెయిల్‌పై వచ్చాడో లేదో కూడా తెలియకముందే సైట్ రీ లాంచ్ అయింది. ఇది టెక్నాలజీని, చట్టంలోని లొసుగుల్ని పూర్తిగా అర్థం చేసుకుని ఆడుతున్న గేమ్ అనే కామెంట్స్ వస్తున్నాయి.

పోలీసులు ఒక డొమైన్ బ్లాక్ చేసే లోపు మూడు మిర్రర్ సైట్లు రెడీ అవుతున్నాయి. VPN, టెలిగ్రామ్ బాట్‌లతో సినిమా లింక్ నేరుగా ఫోన్‌లోకి వచ్చేస్తుంది. నష్టం మాత్రం ఎప్పటిలాగే చిన్న నిర్మాతకే. పెద్ద హీరో సినిమా పైరసీ అయినా వీకెండ్ కలెక్షన్స్ వస్తాయి. కానీ 2 కోట్ల బడ్జెట్ సినిమాకి ఫస్ట్ డే HD ప్రింట్ లీక్ అయితే, థియేటర్‌కి వెళ్లే వాడు ఉండడు. అయితే పైరసీ చూసే వాళ్లలో 80% మంది.. టికెట్ రేట్లు ఎక్కువ, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ బాగోలేదు.. అనే కారణం చెబుతారు. ఇది నిజమే.

సింగిల్ స్క్రీన్లు మెయింటెనెన్స్ లేక పాడుబడ్డాయి, మల్టీప్లెక్స్‌లో పాప్‌కార్న్ సినిమా టికెట్‌తో సమానం. ఈ గ్యాప్‌నే ఐబొమ్మ క్యాష్ చేసుకుంటోంది. కాబట్టి పోలీస్ రైడ్స్‌తో పాటు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మారాలి, టికెట్ ధరలపై కంట్రోల్ రావాలి. లేకపోతే రవి పోయి రమేష్ వస్తాడు, ఐబొమ్మ పోయి బొమ్మ టీవీ వస్తుందని నెటిజన్లు చెబుతున్నారు. చట్టం, టెక్నాలజీ, ఆడియన్స్ మైండ్‌సెట్ మూడూ మారితే తప్ప ఈ భూతాన్ని బాక్స్‌లో పెట్టలేం అని అర్ధమవుతుంది.