కొన్ని నెలలు వెనక్కి వెళ్తే.. ప్రభాస్ సినిమా రాజాసాబ్ గురించి ఆ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్లో కమెడియన్ సప్తగిరి చెప్పిన మాటలు అభిమానులకు గుర్తుండే ఉంటాయి. ఆ చిత్రం అన్ని రికార్డులూ బద్దలు కొట్టేస్తుందని, 2 వేల కోట్ల వసూళ్లు సాధిస్తుందని గొప్పలు పోయాడు సప్తగిరి. తీరా చూస్తే ఆ సినిమా ప్రభాస్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.
సప్తగిరి చెప్పిన దాంట్లో పదోవంతుకు మించి వసూళ్లు రాలేదు. అప్పుడు ఆ సినిమా గురించి అంత హైప్ ఇచ్చి ట్రోల్స్‌కు గురైన సప్తగిరి.. ఇప్పుడు అదే మూవీ గురించి నోరుజారి మళ్లీ విమర్శల బారిన పడ్డాడు. తాను ప్రత్యేక పాత్ర పోషించిన పురుషః అనే సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో అతను రాజాసాబ్‌ను చిన్న సినిమాగా అభివర్ణిస్తూ మాట్లాడడం వివాదానికి దారి తీసింది.
మొదట కమెడియన్‌గా పరిచయం అయిన సప్తగిరి.. తర్వాత హీరోగా మారి కొన్ని సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. మొదట్లో లీడ్ రోల్స్ చేసిన సినిమాలు ఒక మాదిరిగా ఆడాయి కానీ, తర్వాతి చిత్రాలు తేలిపోయాయి. దీంతో మళ్లీ కమెడియన్ పాత్రల్లోకి మారాడు సప్తగిరి. ఇకపై మళ్లీ హీరో పాత్రలు చేయరా అని అడిగితే.. చేస్తానని చెప్పిన సప్తగిరి, మూడు సబ్జెక్టులు రెడీ చేసినట్లు వెల్లడించాడు.
ఈ క్రమంలోనే అతను మాట్లాడుతూ.. ఈ మధ్య చాలా వరకు చిన్న సినిమాలే చేశానంటూ వరుసగా ఒక లిస్టు చెప్పాడు. అందులో సరస్వతి, కొక్కొరకో లాంటి చిత్రాలతో పాటు రాజాసాబ్‌ను కూడా చేర్చేశాడు సప్తగిరి. అతను స్పష్టంగా రాజాసాబ్‌ను చిన్న సినిమా అని చెప్పడంతో ప్రభాస్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
రిలీజ్‌కు ముందేమో అవసరానికి మించి హైప్ ఇచ్చి.. ఇప్పుడు చిన్న సినిమా అని రాజాసాబ్‌ను తీసిపడేస్తావా అంటూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం చూస్తే.. సప్తగిరి ఈ వ్యాఖ్యలపై సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేయడమో, సోషల్ మీడియా పోస్టు పెట్టడమో చేయక తప్పేలా లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates