కమల్ హాసన్ కల్ట్ కామెడీ మూవీస్ లిస్టులో సతి లీలావతిది ప్రత్యేక స్థానం. వచ్చి ముప్పై సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటికీ ఆడియన్స్ ని మెప్పించే అంశాలు ఎన్నో అనిపిస్తాయి. అలాంటి టైటిల్ పెట్టుకున్నప్పుడు అందులో ఎంతో కొంత ఫన్ ఉంటుందని ఆశించడం సహజం. అందులోనూ మెగా కోడలు లావణ్య త్రిపాఠి టైటిల్ రోల్ పోషించిందంటే కనీస స్థాయిలో కంటెంట్ ఉండాలి. కానీ సతి లీలావతి మొన్న వచ్చిన సంగతే చాలా మంది సాధారణ ప్రేక్షకులకు రిజిస్టర్ కాలేదు.
సరే పబ్లిసిటీ ఎలా ఉన్నా సినిమాలో సరుకు ఉంటే ఆటోమేటిక్ గా జనాలు వస్తారు కానీ లీలావతి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. బిజీగా ఉన్న భార్య వల్ల ఇంకో స్త్రీ వ్యామోహంలో పడిన భర్తను దారికి తెచ్చుకోవడానికి ఒక మహిళ చేసే రకరకాల విన్యాసాలు అసలు స్టోరీ. పాయింట్ లోనే ఎలాంటి కొత్తదనం లేదు. భాగ్యరాజా చిన్న ఇల్లు నుంచి మొన్నటి రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి దాకా ఎన్ని చూశామో లెక్క లేదు. అయినా సరే దర్శకుడు తాతినేని సత్య ఇదే ఎంచుకోవడం విచిత్రం.
కథ ఎంత రొటీన్ గా ఉన్నా కనీసం ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ బలంగా ఉంటే టైం పాస్ అయ్యేది. సతి లీలావతిలో ఆ ఛాన్స్ కూడా లేదు. నరేష్, పవిత్ర లోకేష్, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్, వీటివి గణేష్ లాంటి చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ ఎంత ఉన్నా లాభం లేకపోయింది. దీనికి తోడు బోలెడు డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టడం చేటు చేసింది. దేవ్ మోహన్ హీరోగా ఒరిగింది ఏమి లేదు. మడోనా సెబాస్టియన్ సైతం పట్టులేని పాత్రలో తేలిపోయింది. మిక్కీ జె మేయర్ సంగీతం కూడా సోసోనే.
మొత్తానికి ఓటిటికి ఇవ్వాల్సిన కంటెంట్ ని థియేటర్ కు వదిలినట్టు అయ్యింది. ఇది ముందే గుర్తించారు కాబోలు ప్రచారం విషయంలో టీమ్ చాలా నిర్లిప్తంగా కనిపించింది. పెళ్ళయాక రిలీజవుతున్న లావణ్య త్రిపాఠి సినిమాల్లో ఇదే మొదటిది. కావాలనుకుంటే ఫ్యామిలీ మద్దతు తీసుకుని ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చేసి ఉండొచ్చు. రాకాసకు నీహారిక కొణిదెల చేసింది ఇదే. కానీ సతి లీలావతికి అదేమీ పాటించలేదు. వీకెండ్ కే పరిస్థితి ఇలా ఉంటే సోమవారం నుంచి పరిస్థితి చెప్పనక్కర్లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates