రామ్ విసుగొచ్చే రూటు మార్చాడా

ఇప్పుడున్న జనరేషన్ హీరోలు దర్శకులుగా మారడం అరుదు. కాకపోతే చిరంజీవి తరంతో పోల్చుకుంటే కొంచెం బెటరని చెప్పొచ్చు. మెగాస్టార్ తో పాటు బాలయ్య, వెంకటేష్, నాగార్జున ఏనాడూ మెగా ఫోన్ పట్టుకోవాలని అనుకోలేదు. ఎందుకొచ్చిన రిస్క్ లెమ్మని దానికి దూరంగా ఉన్నారు. విశ్వక్ సేన్ ఎప్పుడో ఫలక్ నుమా దాస్ తో కొంత ముద్ర వేయగలిగారు. దాస్ కా ధమ్కీ తేడా కొట్టినా ఇప్పుడు కల్ట్ రూపంలో మరో వయొలెంట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు.

కిరణ్ అబ్బవరం త్వరలో రియాలిటీ పేరుతో మూవీ తీయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రచనలో తనకున్న పట్టుని డైరెక్షన్ కు మళ్లించడం ద్వారా కొత్తగా ట్రై చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడీ లిస్టులోకి రామ్ పోతినేని చేరడం దాదాపు ఖాయమేనని ఇన్ సైడ్ టాక్. ఈ వారంలో రామ్ పుట్టినరోజు రాబోతున్న నేపథ్యంలో అనౌన్స్ మెంట్ వస్తుందని విశ్వసనీయ సమాచారం. రామ్ ఇంత హఠాత్తుగా ఎందుకు రూట్ మార్చాడనే సందేహం రావడం సహజం.

చూస్తుంటే వరస ఫ్లాపులతో వచ్చిన విసుగు, ఏ దర్శకుడిని నమ్మినా ఫలితం రిపీట్ కావడం దీనికి ప్రేరేపించి ఉండొచ్చు. ఆంధ్రకింగ్ తాలూకాకు టాక్, రివ్యూస్ బాగున్నప్పటికీ ఫ్లాప్ అయ్యింది. అంతకు ముందు కోలీవుడ్ నుంచి వచ్చిన లింగుస్వామికి అవకాశం ఇస్తే నిండా మునిగే సినిమా దక్కింది. హిట్ ఇచ్చారు కదా అనే నమ్మకంతో సీక్వెల్ కి ఒప్పుకుంటే పూరి జగన్నాథ్ కూడా సేమ్ రిజల్ట్ ఇచ్చారు. ఇదంతా చూసే రామ్ మనసు మారి ఉండొచ్చు.

అయితే ఫీల్డ్ లో దిగాక ఇదంత సులభంగా ఉండదు. హీరోగా ఉన్న కంఫర్ట్ దర్శకుడిగా మారాక తగ్గిపోతుంది. పెద్ద బాధ్యత నెత్తి మీద పడుతుంది. ఎన్టీఆర్, కృష్ణ, ఆర్ నారాయణమూర్తి, దాసరి లాంటి అతి కొందరు మాత్రమే ఈ రెండు పడవల ప్రయాణాన్ని అద్భుతంగా నిర్వహించారు. మరి రామ్ ఆ కోవలోకి చేరాలంటే చాలా కష్టపడాలి. పైగా హిట్ కొట్టే తీరాలనే ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. సో రామ్ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడోనని అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.