ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన వెబ్ సిరీస్‌లలో ‘మీర్జాపూర్’ ఒకటి. అది చూసిన వాళ్లు ఎవ్వరూ అందులో మున్నా పాత్రను చేసిన నటుడిని అంత సులువుగా మరిచిపోలేరు. తన పేరు.. దివ్యేందు శర్మ. ఈ సిరీస్‌లో మున్నాది విలన్ పాత్ర. కానీ హీరోలను మించి పాపులారిటీ తెచ్చుకున్నాడు. చిత్రంగా ప్రవర్తిస్తూ.. పచ్చి బూతులు మాట్లాడుతూ అతను పంచిన వినోదం కుర్రాళ్లకు బాగా నచ్చింది. తెలుగు వాళ్లలో సైతం దివ్యేందు బాగానే పాపులర్ అయ్యాడు.
దివ్యేందు బూతులు మాట్లాడే సన్నివేశాలను మన వాళ్లు మీమ్ మెటీరియల్‌గా వాడుతుంటారు. ఈ టాలెంటెడ్ నటుడు హిందీలో ఇంకా పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేశాడు. తనకు బాలీవుడ్లో మంచి డిమాండే ఉంది. వేరే ఇండస్ట్రీల్లో విలన్, క్యారెక్టర్ రోల్స్‌లో ఏ కొత్త ఆర్టిస్ట్ పాపులర్ అయినా.. మన ఫిలిం మేకర్స్ దృష్టి వాళ్ల మీద పడిపోతుందన్నది తెలిసిన సంగతే. దివ్యేందుకు ఆల్రెడీ తెలుగులో ఛాన్స్ వచ్చేసింది.
వచ్చే నెలలో విడుదల కాబోయే రామ్ చరణ్ క్రేజీ మూవీ ‘పెద్ది’లో దివ్యేందు ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. తనది విలన్ పాత్రా.. క్యారెక్టర్ రోలా అన్న దానిపై క్లారిటీ లేదు. తాను ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్న విషయాన్ని దివ్యేందు ఇంతకుముందే ధ్రువీకరించాడు. ‘పెద్ది’ రిలీజ్‌కు ముందే అతను మరో పెద్ద తెలుగు సినిమాలో అవకాశం అందుకోవడం విశేషం.
ఆ చిత్రమే.. ఆదర్శ కుటుంబం-ఏకే 47. విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో తాను నటిస్తున్న విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇతర భాషల్లో మీరు ఏం సినిమాలు చేస్తున్నారు అని అడిగితే.. తెలుగు సినిమాల గురించి ప్రస్తావించాడు దివ్యేందు.
ముందు ‘పెద్ది’ గురించి చెప్పి, దీంతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే పెద్ద దర్శకుడి సినిమాలోనూ నటిస్తున్నానని చెప్పాడు దివ్యేందు. తొలి చిత్రం విడుదల కాకముందే ఇంకో పెద్ద సినిమాలో ఛాన్స్ పట్టేశాడంటే.. తెలుగులో దివ్యేందు ఫుల్ బిజీ అయ్యేలాగే కనిపిస్తున్నాడు. ముందు ‘పెద్ది’లో తన పాత్ర, నటన ఎలా ఉంటుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates