హీరోగా అవకాశాలు ఆగిపోయిన టైంలో ‘లెజెండ్’ సినిమాతో విలన్ అవతారం ఎత్తారు సీనియర్ నటుడు జగపతిబాబు. దీంతో ఓవర్ నైట్ ఆయన కెరీర్ మారిపోయింది. ఆ తర్వాత ఒకవైపు విలన్ పాత్రలు చేస్తూనే.. ఇంకోవైపు క్యారెక్టర్ రోల్స్ కూడా బోలెడు చేశాడు. ఐతే ఆయన చేసిన తండ్రి పాత్రల్లో చాలా వరకు ఒక మూసలో ఉంటాయి. ‘శ్రీమంతుడు’ సహా కొన్ని సినిమాల్లో ఆయన పాత్రలు క్లిక్ కావడంతో అలాంటి రిచ్ ఫాదర్ పాత్రలనే ఆయనకు ఇస్తూ వచ్చారు ఫిలిం మేకర్స్. ఈ విషయంలో జగపతి స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు కూడా.
ఈ ఫాదర్ క్యారెక్టర్లతో పాటు అల్ట్రా మోడర్న్ విలన్ పాత్రలు కూడా తనకు బోర్ కొట్టేశాయని ఆయన రెండు మూడు సందర్భాల్లో చెప్పారు. తనను యంగ్ ఫిలిం మేకర్స్ చిన్న సినిమాల్లో సామాన్య పాత్రలకు కన్సిడర్ చేయకపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశాడు. తన పారితోషకం ఎక్కువ అని భయపడుతున్నారేమో అని, చిన్న సినిమాలకు అవసరమైతే పారితోషకం తగ్గించుకుని నటించడానికి కూడా తాను సిద్ధమని ఆయనన్నారు.
ఇలా చివరగా జగపతి తాను నటించనందుకు ఫీలైన సినిమాల్లో ‘లిటిల్ హార్ట్స్’ కూడా ఒకటి. అందులో రాజీవ్ కనకాల చేసిన హీరో తండ్రి పాత్రకు తనను దర్శకుడు సాయి మార్తాండ్ అడిగినా చేయలేకపోయినందుకు తర్వాత రిగ్రెట్ అయ్యారు. అందుకు ప్రతిగా ఆ దర్శకుడి తర్వాతి చిత్రాన్ని తనే నిర్మించడానికి కూడా జగపతి రెడీ అయిన సంగతి తెలిసిందే.
ఐతే ‘లిటిల్ హార్ట్స్’ మిస్ అయిన రెగ్రెట్‌తోనే జగపతి తర్వాత ‘గోదారి గట్టుపైన’ సినిమా చేశాడా అనే సందేహాలు కలుగుతున్నాయి ఈ సినిమా చూస్తే. ఇందులో కూతురిని అమితంగా ప్రేమించే ఒక మధ్యతరగతి తండ్రి పాత్రలో ఆయన చక్కగా ఒదిగిపోయారు.
ఇందులో ఆయన పాత్ర పేరు శ్యామ్ బాబు. తను క్రిస్టియన్. నైట్ వాచ్‌మన్ పని చేస్తుంటాడు. ఐతే ఆదాయం తక్కువ అయినా.. కూతురంటే మహా ఇష్టం. ఆమె కోసం ఏం చేయడానికైనా సిద్ధం. తన కంటే ఉన్నతమైన కుటుంబంలో కూతుర్ని ఇవ్వాలని తపన పడతాడు. కూతురు ఒక ఆటోడ్రైవర్‌ను ప్రేమించిందని తెలియగానే తట్టుకోలేకపోతాడు. అలా అని ఆ కోపాన్ని కూతురు మీద చూపించడు.
తన ముందు మంచివాడిలా నటిస్తూనే.. ఆమె ప్రేమించిన వాడి నుంచి విడగొట్టే పాత్రలో జగపతి నటన ఆకట్టుకుంది. ఈ చిన్న సినిమాకు ఒక వెయిట్ తీసుకురావడంలో జగపతిబాబు కీలక పాత్ర పోషించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates