ఊరించింది చాలు హీరో గారు

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఒకప్పుడు ఎంత గొప్ప గొప్ప సినిమాలు చేశాడో తెలిసిందే. ముఖ్యంగా ‘లగాన్’ దగ్గర్నుంచి ఆయన రేంజే మారిపోయింది. అప్పటిదాకా ఖాన్ త్రయంలో మూడో స్థానంలో ఉండేవాడు ఆమిర్. కానీ ‘లగాన్’ తర్వాత షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లను వెనక్కి నెట్టేశాడు. రంగ్ దె బసంతి, 3 ఇడియట్స్, పీకే, దంగల్ చిత్రాలు ఆమిర్ స్టార్ పవర్‌ను ఎవ్వరూ అందుకోలేని స్థాయికి తీసుకెళ్లాయి.

కానీ ‘దంగల్’ తర్వాత మాత్రం ఆమిర్‌కు కలిసి రావడం లేదు. చాలా వేగంగా ఆయన స్టార్ ఇమేజ్, మార్కెట్ కరిగిపోయాయి. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చడ్డా చిత్రాలు దారుణమైన ఫలితాలనందుకుని ఆమిర్‌ను కిందికి తీసుకొచ్చేశాయి. వీటి తర్వాత ‘సితారే జమీన్ పర్’తో ఒక మోస్తరు విజయాన్నందుకున్నాడు కానీ.. ఒకప్పటి వైభవం మాత్రం తిరిగొచ్చేలా కనిపించడం లేదు.

ఐతే ఆమిర్ ఈ మధ్య ఎప్పటికప్పుడు క్రేజీ కాంబినేషన్లలో సినిమాలంటూ ఊరించడమే పనిగా పెట్టుకున్నాడు. ఇటీవలే ఆయన కల్ట్ మూవీ ‘3 ఇడియట్స్’ సీక్వెల్ గురించి వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు స్క్రిప్టు రెడీ అయిందని.. చాలా కొత్తగా, ఆశ్చర్యపరిచేలా ఆ స్క్రిప్టు తయారైందని అన్నాడు ఆమిర్. రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో త్వరలోనే సినిమాను మొదలుపెట్టబోతున్నట్లు కూడా సంకేతాలు ఇచ్చాడు.

కానీ ఇంతకుముందు ‘మున్నాబాయి-3’ విషయంలో ఊరించి ఉస్సూరుమనిపించిన హిరాని.. ఈ సీక్వెల్‌ను ఏమాత్రం ముందుకు తీసుకెళ్తాడో అన్న సందేహలు కలిగాయి. ఈలోపు ఆమిర్ హీరోగా ఇంకో సినిమా తెరపైకి వచ్చింది.
‘లగాన్’ దర్శకుడు అశుతోష్ గోవారికర్‌తో కలిసి లెజెండరీ క్రికెటర్ లాలా అమర్‌నాథ్ బయోపిక్ చేయడానికి ఆమిర్ సిద్ధమవుతున్నాడని.. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని కొత్త ప్రచారం మొదలైంది.

కానీ ఇదెంత వరకు నిజం అన్నదే తేలాల్సి ఉంది. ఎందుకంటే ‘మహాభారతం’, ‘దాదా సాహెబ్ ఫాల్కే’ బయోపిక్.. ఇలా ఆమిర్ ఊరించి ఊరించి పక్కన పెట్టేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఓవైపు ‘3 ఇడియట్స్’ సీక్వెల్ గురించి వార్తలు వచ్చిన కొన్ని వారాలు కాకుండానే ఇప్పుడు ‘లగాన్’ కాంబినేషన్లో అమర్‌నాథ్ బయోపిక్ అంటుండడంతో ఆమిర్‌కు ఇలా ఊరించడమే పనా.. సినిమాలు చేసేదేమైనా ఉందా అని కౌంటర్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో.