సక్సెస్ మాత్రమే మాట్లాడే ఇండస్ట్రీలో కొందరికి అవకాశాలు ఒక సినిమాతో సృష్టించుకున్న బ్రాండ్ వల్ల వస్తాయి. జాతిరత్నాలు దర్శకుడు కెవి అనుదీప్ కి ఇది బాగా అనుభవం. తొలి మూవీ పిట్టగోడ ఫెయిలైనా రెండో చిత్రంతో ఏకంగా బ్లాక్ బస్టర్ సాధించడం చిన్న విషయం కాదు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లాంటి ఆర్టిస్టులు ఇవాళ ఇంత బిజీగా ఉన్నారంటే అందులో జాతిరత్నాలు పోషించిన పాత్ర లేదంటే ఖచ్చితంగా అబద్దమే అవుతుంది. అంతగా ప్రభావం చూపించింది.
అయితే ఆ పేరుని అనుదీప్ పెంచుకోలేకపోయారు. శివ కార్తికేయన్ కథ చెప్పగానే ఓకే చెబితే ప్రిన్స్ రూపంలో ఫ్లాప్ ఇచ్చారు. కట్ చేసుకుని క్లిప్పుల రూపంలో చూస్తే నవ్వుకునే జోకులు ఉంటాయి కానీ కమర్షియల్ కోణంలో ప్రిన్స్ ని మెప్పించేలా తీయడంతో అనుదీప్ విఫలమైన మాట వాస్తవం. సరే జరిగిందేదో జరిగిందనుకుని విశ్వక్ సేన్ ఫంకీ అది కూడా సితార లాంటి పెద్ద బ్యానర్ లో ఛాన్స్ ఇస్తే ఈసారి ఇంకా నిరాశపరిచే ఫలితంతో పాటు అదనంగా ట్రోలింగ్ దక్కింది.
తాజాగా అనుదీప్ కు నితిన్ తో చేసే అవకాశం దక్కినట్టు లేటెస్ట్ అప్డేట్. ఇద్దరూ ఫ్లాఫుల్లోనే ఉన్నారు కాబట్టి కలిస్తే హిట్టు కొట్టొచ్చనే నమ్మకం కాబోలు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దీన్ని తెరకెక్కించవచ్చని తెలిసింది. ఈ సంస్థ కూడా రాజా సాబ్ లాంటి షాకులతో ప్రొడక్షన్ పరంగా కొంచెం నెమ్మదించింది. అయితే అనుదీప్ ఈసారి గురి తప్పకూడదు. తనకంటూ యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళను మెప్పించేలా బెటర్ ఎంటర్ టైన్మెంట్ రాసుకోవాల్సిందే.
ఎంతసేపూ సోషల్ మీడియా ట్రెండ్స్ మీద ఆధారపడకుండా కొత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఫంకీలో జరిగింది ఇదే. సింపుల్ కామెడీకి జనాలు ఎగబడి నవ్వుతారనే లెక్క పూర్తిగా తప్పింది. ఎప్పుడూ ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండకూడదన్న పాఠాన్ని నేర్పించింది. నితిన్ ఒకేసారి మూడు సినిమాలు లైన్ లో పెట్టే పనిలో ఉన్నాడు. వరస డిజాస్టర్లు డిస్టర్బ్ చేసినా కొంచెం గ్యాప్ తీసుకుని వెంటనే బిజీ అయ్యాడు. మరి అనుదీప్ వీలైనంత కంబ్యాక్ కావడం తనకే కాదు అభిమానులకూ అవసరమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates