సుమంత్ పేరు వెనుక‌ ప్ర‌భాస్ ఎందుకు?

మేం ఫేమ‌స్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ న‌టుడు సుమంత్ ప్ర‌భాస్. షార్ట్ ఫిలిమ్స్ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన ఈ కుర్రాడు.. చిన్న వ‌య‌సులో హీరోగా అరంగేట్రం చేస్తూ, ఆ చిత్రానికి త‌నే ద‌ర్శ‌క‌త్వం కూడా చేయ‌డం విశేషం. సోష‌ల్ మీడియా ద్వారా ఆ సినిమాకు మంచి బ‌జ్ క్రియేట్ చేసి ఓపెనింగ్స్ తెచ్చుకుని ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించాడు సుమంత్. ఓవ‌రాల్‌గా ఆ సినిమా ఒక మోస్త‌రు ఫ‌లితాన్నందుకుంది.

ఇప్పుడు సుమంత్ రెండో చిత్రం గోదారి గ‌ట్టుపైన కూడా అదే త‌ర‌హాలో బ‌జ్ క్రియేట్ చేసింది. ఈ వారం సినిమాల్లో జ‌నాల‌ను థియేట‌ర్ల‌కు తీసుకొచ్చిన చిత్ర‌మిదే. దీనికి రివ్యూలు, టాక్ యావరేజ్ అనేలాగే ఉన్నాయి. మ‌రి సినిమా అంతిమంగా ఎలాంటి ఫ‌లితాన్నందుకుంటుందో చూడాలి. సుమంత్ అండ్ టీమ్ అయితే సినిమాను గ‌ట్టిగానే ప్ర‌మోట్ చేస్తోంది. ఈ చిత్రంలో కీల‌క పాత్ర చేసిన సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు సైతం ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొంటున్నాడు.

ఆయ‌న‌తో క‌లిసి చేసిన ఒక ఇంట‌ర్వ్యూలో సుమంత్ ప్ర‌భాస్ త‌న పేరు వెనుక ఉన్న స్టోరీని బ‌య‌ట‌పెట్టాడు. సుమంత్ ప్ర‌భాస్ అని ఇలా రెండు పేర్లు క‌లిపి పెట్టుకోవ‌డం ఏంటి.. దీని వెనుక క‌థేంటి అని జ‌గ‌ప‌తిబాబు అడ‌గ్గా.. సుమంత్ స‌మాధానం చెప్పాడు.

తాను చిన్న‌త‌నంలో బుజ్జిగాడు సినిమా చూసి ప్ర‌భాస్ ఫ్యాన్ అయ్యాన‌ని సుమంత్ తెలిపాడు. ఎనిమిదో క్లాసులో ఉండ‌గా ఫేస్ బుక్ ఐడీ క్రియేట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే.. సుమంత్ రెడ్డి పేరుతో ఐడీ క్రియేట్ కాలేద‌ని అన్నాడు.

దీంతో త‌న పేరుకు త‌న ఫేవ‌రెట్ హీరో అయిన‌ ప్ర‌భాస్ నేమ్ కూడా జోడించి, ఇంకేవో నంబ‌ర్లు కూడా యాడ్ చేస్తే అప్పుడు ఓకే అయింద‌ని.. దీంతో త‌న పేరులోనూ సుమంత్ ప‌క్క‌న ప్ర‌భాస్ అని జోడించాన‌ని.. అలాగే పాపులర్ అయిన తాను ఇప్పుడు స్క్రీన్ నేమ్‌గా కూడా దాన్నే ఉంచేశాన‌ని తెలిపాడు. ఎలాగూ ఇండ‌స్ట్రీలో సుమంత్ పేరుతో ఒక సీనియ‌ర్ హీరో ఉన్న నేప‌థ్యంలో సుమంత్ ప్ర‌భాస్ అని పెట్టుకోవ‌డం ఈ కుర్రాడికి మంచిదే అయింది.