‘పెద్ది’ సీక్రెట్ బయటపెడతారా?

ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల ఆశలన్నీ కూడా ‘పెద్ది’ సినిమా మీదే ఉన్నాయి. సంక్రాంతి తర్వాత థియేటర్లను కళకళలాడించే సినిమాలు లేక బాక్సాఫీస్ వెలవెలబోతోంది. ఒకటీ అరా సినిమాలు తప్పితే చాలు వరకు నిరాశపరిచినవే. మేలో రాబోతున్న తర్వాతి సినిమాల మీద కూడా పెద్దగా అంచనాలు లేవు. జూన్ 4న ‘పెద్ది’ వస్తేనే థియేటర్లలో మళ్లీ సందడి వస్తుందని ఎదురు చూస్తున్నారంతా. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ ‘పెద్ది’ ఈసారి మాత్రం డేట్ తప్పదనే భావిస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దాంతో పాటే ప్రమోషన్లు కూడా గట్టిగా చేయాల్సిన అవసరముంది. ఈ నెల మూడో వారం నుంచి చరణ్ అండ్ టీం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుందని భావిస్తున్నారు. ఐతే టీం రంగంలోకి దిగి చేసే ప్రచారం కంటే ఎగ్జైటింగ్ కంటెంట్‌తో టీం సినిమాను వార్తల్లో నిలబెట్టడం కీలకం. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ ట్రైలర్ మీదే ఉంది.

విడుదలకు రెండు వారాల ముందే ‘పెద్ది’ ట్రైలర్‌ను లాంచ్ చేయాలని టీం చూస్తోంది. దర్శకుడు బుచ్చిబాబుతో పాటు ఈ చిత్రంలో నిర్మాణ భాగస్వామి అయిన సుకుమార్ సైతం ట్రైలర్ కట్ మీద దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ‘పెద్ది’ నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ప్రోమోలు చూస్తే కథ మీద పెద్దగా ఐడియా రాలేదు.

ఫస్ట్ గ్లింప్స్‌లో హీరో ఊరిలో అల్లరి చిల్లరిగా తిరుగుతూ క్రికెట్ టోర్నీలు ఆడే కుర్రాడిగా కనిపించాడు. చివరి ప్రోమోలో చరణ్‌ను కుస్తీ యోధుడిగా చూపించారు. మరి ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అంతా ఎందుకు అన్నది తెలియలేదు.
ఈ సినిమా కథేంటన్నది ఇప్పటిదాకా ఏ హింట్ ఇవ్వలేదు. ట్రైలర్లో కథ గురించి చూచాయిగా అయినా చెప్పక తప్పదు.

ఒక గుర్తింపు అంటూ లేని ఒక ఊరి కోసం పాటు పడే కుర్రాడి కథగా ‘పెద్ది’ని చెబుతున్నారు. ఈ క్రమంలో అతడి జీవితంలో ఊహించిన మలుపులు ఉంటాయి. సినిమాలో ప్రేక్షకులను షాక్‌కు గురి చేసే ఒక ట్విస్ట్ ఉంటుందని సమాచారం. ఐతే థియేటర్లలో ప్రేక్షకులకు సర్ప్రైజ్ లాగా దాన్ని దాచి పెడతారా.. లేక ప్రేక్షకులను ప్రిపేర్ చేయడం కోసం ట్రైలర్లోనే దాన్ని రివీల్ చేస్తారా అన్నది ఆసక్తికరం.