ట్రైల‌ర్ టాక్: పూర్తి స్థాయి సైకోగా మారిన నందు

ఒకప్పుడు విల‌న్ పాత్ర‌లు మాత్ర‌మే విప‌రీత మ‌న‌స్త‌త్వంతో చిత్ర విచిత్రంగా ప్ర‌వ‌ర్తించేవి. హీరోలంటే అన్నీ మంచి ల‌క్ష‌ణాలే ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండు మారిపోయింది. హీరోల పాత్ర‌లే విల‌న్ల త‌ర‌హాలో ఉంటున్నాయి. ఇదంతా అర్జున్ రెడ్డి, పుష్ప లాంటి పాత్ర‌ల ప్ర‌భావమే. వీటిని అనుక‌రించే పాత్ర‌లు ఇప్ప‌టికే చాలా వ‌చ్చాయి. యువ న‌టుడు నందు.. ఇప్ప‌టికే సైక్ సిద్దార్థ సినిమాలో అదో టైపు క్యారెక్ట‌ర్ చేశాడు.

ఐతే అందులో త‌న క్యారెక్ట‌ర్లో కొంత‌మేర‌ నెగెటివ్ షేడ్స్ ఉంటాయి కానీ.. అత‌ను పూర్తిగా చెడ్డ‌వాడేమీ కాదు. రాను రాను అత‌డి పాత్ర‌లో ప‌రివ‌ర్త‌న వ‌స్తుంది. కానీ ఇప్పుడు నందు నుంచి రాబోతున్న అగ్లీ స్టోరీ మాత్రం అందుకు భిన్నం. ఇందులో అత‌ను పూర్తి స్థాయి సైకో పాత్ర‌నే చేసిన‌ట్లున్నాడు. మే 22న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి టీం తాజాగా ట్రైల‌ర్ లాంచ్ చేసింది.

ప్రేమ పేరుతో అమ్మాయికి న‌ర‌కం చూపించే పాత్ర‌ను చేశాడు నందు ఇందులో. చిన్న‌త‌నంలో త‌న మ‌న‌సుకు త‌గిలిన గాయం వ‌ల్ల సైకోగా మారిన అత‌ను.. తాను ప్రేమించిన అమ్మాయితో సైకోలా ప్ర‌వ‌ర్తిస్తూ ఆమెకు ప్ర‌తిక్ష‌ణం చుక్క‌లు చూపించడం.. అత‌డి చేష్ట‌ల‌ను భ‌రించి భ‌రించి అల‌సిపోయిన అమ్మాయి చివ‌రికి అత‌ణ్ని వ‌దిలి వెళ్లిపోవ‌డం.. ఆ త‌ర్వాత అత‌ను సాగించే విధ్వంసం.. ఈ నేప‌థ్యంలో ఈ క‌థ న‌డిచేలా ఉంది.

నందు సైకో ల‌వ‌ర్ పాత్ర‌లో జీవించేసిన‌ట్లున్నాడు. త‌న న‌ట‌న‌.. డైలాగులు ఒళ్లు గ‌గుర్పొడిచేలా ఉన్నాయి. ఈ సినిమా చాలా బోల్డ్‌గా కూడా ఉంటుంద‌ని కొన్ని స‌న్నివేశాలు చూస్తే అర్థ‌మ‌వుతుంది. డైలాగ్స్ కూడా అలాగే ఉన్నాయి. నందు వ‌ల్ల న‌ర‌కం చూసే అమ్మాయి పాత్ర‌లో అవికా గోర్ న‌టించింది. ఈ పాత్ర చేస్తూ తాను చాలా ఇబ్బంది ప‌డ్డాన‌ని.. త‌న కెరీర్లో ఎప్పుడూ ఇలాంటి ప‌రిస్థితి ఎదుర్కోలేద‌ని ఆమె చెప్ప‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ణ‌వ స్వ‌రూప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మే 22న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.